బాలిక కిడ్నాప్ కలకలం…!
పట్టపగలే కిడ్నాప్ డ్రామా: బాలిక నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు చేతులు కట్టేసి..

- బాలిక కిడ్నాప్‌కు విఫలయత్నం..!
- బాబాయి వరుసయ్యే వ్యక్తి ఘాతుకం
- పట్టపగలే కిడ్నాప్ డ్రామా: బాలిక నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు చేతులు కట్టేసి..
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మండలంలోని ఒక గ్రామంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్ బాలికను అపహరించేందుకు ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్థానికులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమెకు బాబాయి వరుసయ్యే ఓ యువకుడు, మరో గ్రామానికి చెందిన తన స్నేహితుడితో కలిసి ఇంట్లోకి చొరబడ్డారు. బాలిక కేకలు వేయకుండా ఆమె నోటికి ప్లాస్టర్ అంటించి, కాళ్లు చేతులు తాళ్లతో కట్టి బలవంతంగా బయటకు లాక్కొచ్చారు.గ్రామ శివార్లలో సిద్ధంగా ఉంచిన కారు వద్దకు ఆమెను తీసుకెళ్తుండగా, అటుగా వెళ్తున్న కొందరు గమనించారు. వెంటనే వారు బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన బంధువులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని బాలిక కట్లు విప్పి కాపాడారు. కిడ్నాప్‌కు పాల్పడిన యువకులకు దేహశుద్ధి చేస్తుండగా, ఒకరు తప్పించుకోగా.. ప్రధాన నిందితుడిని పట్టుకుని సోమవారం పట్టణ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని,మైనర్ బాలికపై అరాచకానికి ఒడిగట్టినందుకు గాను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. కూతురు వరుసయ్యే బాలికపై ఈ రకమైన దారుణానికి పాల్పడటం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



