పాఠశాల గోడల నుంచి పంచాయతీ పాలనలోకి!

- టీచర్ రాజకీయం!
- గెలిపిస్తే గ్రామానికే ‘ఫస్ట్ ర్యాంక్’ అంటున్న ఇస్మాయిల్!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ పంచాయతీ ఎన్నికల బరిలో అభ్యర్థుల కథలు, వాగ్దానాలు సహజమే. కానీ,తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం, గోటిగా కలాన్ గ్రామంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తమ విద్యార్థులకు జ్ఞానాన్ని పంచి, ఆదర్శంగా నిలిచిన ఓ ప్రైవేట్ టీచర్… ఇప్పుడు ఏకంగా గ్రామ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు! గత కొన్నేళ్లుగా ప్రైవేట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇస్మాయిల్ తమ గ్రామంలోని 1వ వార్డ్ మెంబర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.సాధారణంగా పాఠాలు చెప్పడం, పరీక్షలు పెట్టడం, ఫలితాలు ప్రకటించడం ఇస్మాయిల్ దినచర్య. కానీ, ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఆయన మనసు మార్చాయి.ఈ సందర్బంగా… ఇస్మాయిల్ మాట్లాడుతూ.. బడిలో పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం పాఠాలు చెప్తాను. కానీ, గ్రామంలోని సమస్యలను చూసిన తర్వాత, బడి గోడల దాటి, సమాజ సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. నా వార్డు ప్రజలు నన్ను గెలిపిస్తే, నా క్లాసులో పిల్లలకు చెప్పినట్టే, మా వార్డును కూడా ప్రగతిలో ‘ఫస్ట్ ర్యాంక్’ లో నిలబెడతాను,” అని ఇస్మాయిల్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
ప్రైవేట్ టీచర్‌గా ఆయనకున్న నిబద్ధత, క్రమశిక్షణ, సమస్యలను విశ్లేషించే నైపుణ్యం… ఇప్పుడు వార్డ్ మెంబర్‌గా ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి. విద్యావంతుడైన ఇస్మాయిల్ రాకతో, గోటిగా కలాన్ గ్రామ 1వ వార్డు ఎన్నిక… అందరి దృష్టిని ఆకర్షిస్తోంది!



