- అధికారంలో బీసీల వాటా కోసం ఐక్యంగా పోరాడాలి – ఆర్. కృష్ణయ్య
- వికారాబాద్‌లో నూతన బీసీ సర్పంచుల ఘన సన్మానం
- పాల్గొన్న బీసీ సంఘం జాతీయ నేత రాజ్ కుమార్ కందుకూరి
జనవాహిని ప్రతినిధి వికారాబాద్ :- ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలు రాజకీయంగా సత్తా చాటాయని, అదే స్ఫూర్తితో అధికారంలో సముచిత వాటా కోసం పోరాడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నూతన బీసీ సర్పంచుల విజయోత్సవ సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందడం శుభపరిణామమని, ఇది బీసీల రాజకీయ చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గెలిచిన సర్పంచులు తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు తాండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గెలుపొందిన నూతన బీసీ సర్పంచులు, బీసీ సంఘం నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ, స్థానిక సంస్థల నుండి అసెంబ్లీ వరకు బీసీల ప్రాతినిధ్యం పెరగాలని, గెలిచిన ప్రతి సర్పంచ్‌కు బీసీ సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాండూర్ నియోజకవర్గం మరియు జిల్లాలోని వివిధ మండలాల నుండి గెలుపొందిన బీసీ సర్పంచులను ఆర్. కృష్ణయ్య మరియు రాజ్ కుమార్ కందుకూరిలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభలో జిల్లా బీసీ సంఘం ప్రతినిధులు, వివిధ గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






