- బిఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ కుంపటి
- చైర్మన్ అభ్యర్థిపై రెబల్స్ తిరుగుబాటు!
- యువ కార్యకర్తల విస్మరణే కారణమా? రహస్య సమావేశం లో ఎం జరిగింది.
- తాండూరులో గులాబీ కేడర్ మధ్య రగులుతున్న అసమ్మతి జ్వాలలు.
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ తాండూరు బిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఒక్కసారిగా చెలరేగుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నిక్కాసులైన కార్యకర్తలను కాదని, కేవలం పార్టీ కి చెందిన ఓ నాయకుడి ప్రోత్బలం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ యువ నాయకత్వం భగ్గుమంటోంది.గత ఎన్నికల్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన యువ కార్యకర్తలను ప్రస్తుత నాయకత్వం విస్మరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబద్ధతతో పనిచేసే వారికి కాకుండా, కేవలం ఆర్థిక బలం, పలుకుబడి ఉన్నవారికే టికెట్ల కేటాయింపులో ఆ నాయకుడు ముగ్గు చూపుతున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరిస్తున్నారు.పార్టీ లో ఓ బడా నాయకుడు ఏకపక్ష వైఖరికి తగిన గుణపాఠం చెప్పే దిశగా ఆశావహులు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు అసమ్మతి నేతలు, యువ నాయకులు రహస్యంగా అంతర్గత సమావేశాన్ని నిర్వహించుకున్నట్టు సమాచారం.పార్టీ అధికారిక అభ్యర్థులకు ధీటుగా రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఆ నాయకుడు అనుసరిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలని, తమ రాజకీయ భవిష్యత్తును తామే తేల్చుకోవాలని వారు తీర్మానించుకున్నారు.పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలను పక్కన పెట్టడం వల్ల రాబోయే ఎన్నికల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంగా ముద్రపడిన యువత ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం తాండూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారనుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ప్రభావం అధికారిక అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే అవకాశం ఉందని తెలుస్తుంది.






