- పోలీసులకు, టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం..
- మున్సిపల్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పురపాలక ఎన్నికల సమరంలో తొలిరోజే రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన బుధవారం నాడే పోలీసులకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.నిబంధనల విషయంలో పట్టుబట్టిన పోలీసులుఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోనికి అనుమతి ఉంటుందని విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. అయితే, తమ అభ్యర్థి వెంబడి ఐదుగురు నేతలు వెళ్తామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టుబట్టారు. దీనికి పోలీసులు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి, కాసేపు మాటల యుద్ధం కొనసాగింది.ఒకానొక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ, పోలీసులు నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో బిఆర్ఎస్ శ్రేణులు శాంతించాయి. ఎన్నికల నిర్వహణకు, అధికారుల విధులకు ఆటంకం కలిగించబోమని, పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలుపుతూ నాయకులు అక్కడి నుండి వెనుదిరిగారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద నెలకొన్న గందరగోళం సద్దుమణిగింది. మొదటి రోజు కావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.






