
- సెంట్ మేరీస్ పాఠశాలలో సంక్రాంతి సందడి
- – అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు
- – పోటాపోటీగా ముగ్గుల పోటీలు, ఆటపాటలు
- – తెలుగు సంస్కృతిని చాటిన విద్యార్థినిలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని స్థానిక సెంట్ మేరీస్ పాఠశాల ప్రాంగణంలో మంగళవారం సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలు పల్లె వాతావరణాన్ని తలపించాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి, మన ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా విద్యార్థినులకు నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థినులు పాఠశాల ఆవరణ అంతా రంగురంగుల ముగ్గులతో నింపేశారు. చుక్కల ముగ్గులు, రథం ముగ్గులు, గాలిపటాల చిత్రాలతో తమ ప్రతిభను చాటారు. అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని, రకరకాల డిజైన్లతో రంగవల్లికలను తీర్చిదిద్దడం విశేషం.ముగ్గుల పోటీలతో పాటు విద్యార్థులకు పాటల పోటీలు మరియు వివిధ రకాల ఆటలను నిర్వహించారు. సంక్రాంతి జానపద గేయాలతో విద్యార్థులు అందరినీ ఉర్రూతలూగించారు. అనంతరం జరిగిన ఆటల పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన ఉండాలని, అందుకే ఇలాంటి పండుగ వేడుకలను పాఠశాలలో నిర్వహిస్తున్నామని యాజమాన్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.



