
- బల్దియా అధికారులలో సమన్వయ లోపం:
- ఓటర్లకు తప్పని తిప్పలు
- ఓటర్ల జాబితా సవరణలో అధికారుల మధ్య కుదరని పొంతన
- పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధుల ఆవేదన
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో, తాండూర్ మున్సిపల్ అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ విషయంలో అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టుకుంటూ కాలయాపన చేస్తుండటంతో అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నెల 1న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్ల తొలగింపు, కొత్త పేర్ల నమోదు వంటి సమస్యల పరిష్కారానికి ప్రజలు తాండూర్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను సంప్రదించారు. అయితే, “మాకు ఎన్నికల నిర్వహణతో సంబంధం లేదు, రెవెన్యూ అధికారులను కలవండి” అంటూ వారు బాధ్యతను తప్పించుకున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
పొంతన లేని సమాధానాలు..!
టౌన్ ప్లానింగ్ అధికారుల సూచన మేరకు రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లగా, అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. “మున్సిపల్ కమిషనర్ నుండి మాకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అందలేదు” అని వారు సమాధానం ఇవ్వడంతో ప్రజలు విస్తుపోయారు. ఓటర్ల జాబితా సవరణ వంటి కీలక సమయంలో అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ, సమయాభావం దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సమన్వయ లోపాన్ని సరిదిద్దుకుని, ఓటర్ల జాబితాలోని అక్రమాలను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తారో లేదో వేచి చూడాలి.



