- బీసీ సంఘం పోరాటంతోనే తాండూర్ మున్సిపాలిటీలో 42% రిజర్వేషన్లు
- చైర్మన్ పదవితో పాటు 15 వార్డులు బీసీలకే దక్కడం చారిత్రాత్మకం
- జిల్లాలోనే అత్యధిక రిజర్వేషన్లు సాధించిన తాండూర్
- రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ ఉద్యమం : కందుకూరి రాజ్ కుమార్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడం అనేది బీసీ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా సాగించిన నిరంతర పోరాటాల ఫలితమేనని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూర్ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారుపై ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం తాండూర్ మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ (జనరల్)కు కేటాయించబడడం శుభపరిణామన్నారు. మొత్తం 36 వార్డులకు గాను ఏకంగా 15 వార్డులను బీసీలకు రిజర్వ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని, ఇది బీసీ సంఘం ప్రభుత్వంపై చేసిన ఒత్తిడి వల్లనే సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.
వికారాబాద్ జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే తాండూర్‌కు అత్యధికంగా రిజర్వేషన్లు దక్కడం గమనార్హమన్నారు. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా తాండూర్‌లో 42 శాతం సాధించడం బీసీ సంఘం విజయమని రాజ్ కుమార్ పేర్కొన్నారు.ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కేవలం 18 శాతం రిజర్వేషన్ ఉన్నా, 69 సర్పంచ్ స్థానాల్లో బీసీ బిడ్డలు గెలిచి తమ సత్తా చాటారని గుర్తు చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో దక్కిన రిజర్వేషన్లతో బీసీలు రాజకీయంగా మరింత బలపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, రాజ్యాధికారంలో తగిన వాటా సాధించే వరకు పోరాటం ఆపబోమని ఆయన పునరుద్ఘాటించారు.






