- దళిత రైతులపై భూ దౌర్జన్యం..!
- సర్వే నెం. 158 లోని 9 ఎకరాల దళిత భూమిపై కబ్జాదారుల కన్ను.
- జేసిబిలతో పొలంలోకి చొరబడి దౌర్జన్యం.. అడ్డుకున్న రైతులపై కుల వివక్ష దూషణలు.
- తాండూర్ రెవెన్యూ అధికారులకు బాధితుల ఫిర్యాదు.
జనవాహిని ప్రతినిధి తాండూరు :- వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో భూకబ్జా కలకలం రేగుతోంది. బండమీదిపల్లి తండా గ్రామానికి చెందిన పేద దళిత రైతులపై కొందరు వ్యక్తులు గూండాలతో కలిసి దాడికి దిగుతున్నట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వ అండతో పట్టా పొందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.బండమీదిపల్లి తండాకు చెందిన దాసరి అంబాదాస్ మరియు మరో నలుగురు రైతులకు సర్వే నంబర్ 158లో సుమారు 9.21 ఎకరాల లావని పట్టా భూమి ఉంది. ఈ భూమిని సాగు చేసుకుంటున్న తరుణంలో రామచందర్ రావు (రాజన్న గౌడ్), కృష్ణ గౌడ్, కిషన్ చందర్ రావు మరికొంతమంది కలిసి జేసిబిలతో వచ్చి దౌర్జన్యంగా గుంతలు తవ్వడం మొదలుపెట్టారని బాధితులు పేర్కొన్నారు.గతంలో రెవెన్యూ అధికారులు నిర్ణయించిన హద్దులను సైతం పట్టించుకోకుండా, వారు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమిని కాపాడుకోవడానికి వెళ్లిన రైతులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, “ఈ భూమి మీది కాదు” అంటూ గూండాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బాధితులు సోమవారం తాండూరు డివిజనల్ అధికారికి (RDO) వినతిపత్రం అందజేశారు. కబ్జాదారుల నుండి తమ ప్రాణాలను, భూమిని కాపాడాలని, బాధ్యులపై కఠినమైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



