- బిఆర్ఎస్ పార్టీకి వడ్డే శేఖర్ రాజీనామా..!
- బీజేపీలో చేరికకు నిర్ణయం
- పార్టీ కోసం కష్టపడినా దక్కని గుర్తింపు..
జనవాహిని ప్రతినిధి తాండూరు : బిఆర్ఎస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా చేరి, ఎన్నో ఏళ్లుగా పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన వడ్డే శేఖర్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఎంతో శ్రమించినా, తనకు రావాల్సిన గుర్తింపు మరియు సరైన రాజకీయ అవకాశాలు లభించకపోవడంతోనే ఆయన పార్టీ మారే ఆలోచనలో పడ్డారు. మరో 2 రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తానని తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, కార్యక్రమాల నిర్వహణలో ముందుండి పనిచేశానని తెలిపారు. కానీ ఆయన కష్టానికి తగిన గుర్తింపు బిఆర్ఎస్‌లో లభించలేదని తెలిపారు. సరైన అవకాశాలు రాకపోవడంతో ఆవేదనకు గురయ్యానని శేఖర్ పేర్కొన్నారు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించని చోట ఉండటం కంటే, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న వేదికను ఎంచుకోవడమే మేలని భావించి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.బిఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తున్న వడ్డే శేఖర్, భారతీయ జనతా పార్టీ లో చేరుతున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ పరిధిలోని 10వ వార్డ్ నుండి బీజేపీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కమలం పార్టీ ద్వారా తన వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






