- తాండూరు డిపో వద్ద తప్పిన పెను ప్రమాదం
- ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన భారీ లారీ
- కొంతదూరం ఈడ్చుకెళ్లిన వైనం.. డ్రైవర్‌కు గాయాలు
- సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఆర్టీసీ డిపో సమీపంలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. డిపో నుంచి బయటకు వస్తున్న బస్సును వేగంగా వచ్చిన ఓ భారీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు గాయాలవ్వగా, ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.ఘటన వివరాల్లోకి వెళ్తే..తాండూరు డిపోకు చెందిన బస్సు డ్రైవర్ నారాయణ, కండక్టర్ యాదమ్మలు ప్రయాణికులతో కలిసి మెట్లకుంటకు బయలుదేరారు. బస్సు డిపో గేటు దాటి రోడ్డుపైకి వస్తున్న క్రమంలో.. కోడంగల్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. లారీ వేగం ఎంతలా ఉందంటే, బస్సును ఢీకొట్టిన తర్వాత కూడా అలాగే కొంతదూరం ముందుకు లాక్కెళ్లింది.ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బస్సు కుదుపులకు గురికావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. వాహనాలు ఆగిన వెంటనే ప్రయాణికులందరూ భయంతో బస్సులో నుంచి కిందకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. కండక్టర్ యాదమ్మతో పాటు మరికొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం ధాటికి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకున్నారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.లారీ చాలా వేగంగా రావడాన్ని గమనించిన డ్రైవర్ బస్సును ఆపాడు. అయినప్పటికీ లారీ డ్రైవర్ బస్సును ఢీకొట్టి ముందుకు లాక్కెళ్లాడు” అని గాయపడిన డ్రైవర్ నారాయణ తెలిపారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






