
- స్కార్పియోలో వచ్చి.. ‘మేకల’ను కిడ్నాప్ చేశారు!
- బషీరాబాద్‌లో హైటెక్ దొంగల హల్‌చల్
- 24 మేకల ‘లాంగ్ డ్రైవ్’
జనవాహిని ప్రతినిధి తాండూరు : సాధారణంగా స్కార్పియో కారు కనిపిస్తే ఎవరో రాజకీయ నాయకులో లేక పెద్ద ఆఫీసరో వస్తున్నారని అనుకుంటాం. కానీ బషీరాబాద్ మండలంలో మాత్రం ఈ లగ్జరీ కారు ‘మేకల కిడ్నాపర్ల’కు అడ్డాగా మారింది. అవును.. మీరు చదువుతున్నది నిజమే! దొంగలు తమ రూటు మార్చారు. పాత కాలం నాటి పద్ధతులు పక్కన పెట్టి, ఏకంగా ఖరీదైన వాహనంలో వచ్చి మూగజీవాలను మాయం చేస్తున్నారు.మంగళవారం అర్ధరాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. మల్కన్‌గిరి, కంసాన్‌పల్లి (మక్త) గ్రామాల్లోకి నిశ్శబ్దంగా ఒక స్కార్పియో వాహనం ప్రవేశించింది.ముందుగా నర్సప్ప అనే రైతుకు చెందిన 4 మేకలను కారులో ఎక్కించారు. అక్కడి నుంచి కంసాన్‌పల్లికి చేరుకుని కురువ మాసప్పకు చెందిన మరో 20 మేకలను అదే కారులో కుక్కేశారు.మొత్తం 24 మేకలను స్కార్పియోలో లోడ్ చేసుకుని, ఇంజన్ సౌండ్ కూడా రాకుండా అక్కడి నుంచి ఉడాయించారు.షాక్‌లో కాపలాదారులు: తెల్లారి లేచి చూసేసరికి మందలో మేకలు కనిపించకపోవడంతో యజమానులు బిత్తరపోయారు. చుట్టుపక్కల ఆరా తీస్తే.. అర్ధరాత్రి వేగంగా వెళ్లిన స్కార్పియో కారు గురించే అందరూ చర్చించుకుంటున్నారు. “మేకలను దొంగిలించడానికి కారులో రావడమేంటి సామీ?” అని స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.కాపలాదారుల ఆవేదన: కష్టపడి పెంచుకున్న జీవాలను కారులో ఎత్తుకెళ్లడంతో బాధితులు నర్సప్ప, మాసప్ప కన్నీరుమున్నీరవుతున్నారు.



