హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం..!

- గ్రామ పంచాయతీ ఎన్నికలే పునాది
- తాండూరుకు మంజూరైన నిధులను సైతం మళ్లించారని ఆగ్రహం
- హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి
- ముద్దాయిపేట్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తరపున మాజీ ఎమ్మెల్యే ప్రచారం

జనవాహిని ప్రతినిధి తాండూరు : దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ ‘420 హామీలను’ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు పైలెట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలే పునాది వేస్తాయని ఆయన స్పష్టం చేశారు.యాలాల మండలం ముద్దాయిపేట్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి జంగ ఉమారాణి తరపున ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతో, తాను తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో మంజూరు చేయించిన నిధులను కూడా ఇతర ప్రాంతాలకు మళ్లించిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తాండూరు నియోజకవర్గ ప్రజలకు చేసిన అన్యాయం అని పేర్కొన్నారు.”ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. గ్రామ స్థాయి నుండే ఈ మోసపూరిత పాలనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జంగ ఉమారాణిని భారీ మెజార్టీతో గెలిపించి, గ్రామాభివృద్ధికి పాటుపడే అవకాశం కల్పించాలని ముద్దాయిపేట్ గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.



