సిద్దన్న మడుగుతండాలో ఏకగ్రీవం..!

- రెండున్నర ఏళ్ల చొప్పున సర్పంచ్ ఉప సర్పంచ్ గా బాధ్యతలు
- చరిత్ర సృష్టించిన తండా
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఐకమత్యమే మహాబలం అని నిరూపించింది పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండా. సాధారణంగా ఎన్నికలంటే పోటీ, విమర్శలు, ప్రలోభాలు కనిపించే చోట… ఈ తండా గ్రామస్థులు మాత్రం అభివృద్ధికి కొత్త నిర్వచనం చెప్పారు. గ్రామపెద్దల సమక్షంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
రెండేళ్లు నువ్వు, రెండేళ్లు నేను..!
సిద్దన్నమడుగు తండా ఏకగ్రీవానికి అత్యంత ఆకర్షణీయమైన అంశం… ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య కుదిరిన అరుదైన ఒప్పందం.
సర్పంచ్‌గా: విజయ్ రాథోడ్ ఉపసర్పంచ్‌గా: హీరాసింగ్ చవాన్వీరిద్దరూ కేవలం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మాత్రమే కాదు, తలా రెండున్నర సంవత్సరాలు సర్పంచ్‌గా, ఉపసర్పంచ్‌గా బాధ్యతలు పంచుకునేందుకు ఒకరితో ఒకరుఒప్పందం చేసుకున్నారు. మొదట సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మధ్యలో ఉపసర్పంచ్‌గా మారతారు. ఈ విధంగా పదవీ కాలాన్ని సమానంగా పంచుకోవడం వెనుక కేవలం గ్రామ అభివృద్ధి అనే ఏకైక లక్ష్యం ఉంది.
తండా పెద్దల మాటల్లో…!
మాది వెనకబడిన ప్రాంతం. ఎన్నికల పేరుతో విడిపోవడం, గొడవలు పడటం కంటే… ఐకమత్యంగా ఉంటేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏకగ్రీవంతో వచ్చే ప్రోత్సాహకాలతో పాటు, ప్రభుత్వం కూడా మా తండా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి,” అని గ్రామపెద్దలు విజ్ఞప్తి చేశారు.సిద్దన్నమడుగు తండా గ్రామ అభివృద్ధి కోసం తీసుకున్న ఈ వినూత్న, సాహసోపేత నిర్ణయం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వం ఈ తండా ఏకగ్రీవానికి తగిన గుర్తింపు, నిధులు కేటాయించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.



