భద్రేశ్వరుడి సాక్షిగా… భూబాగోతం..!

- దేవుడి జాగలో ‘కమర్షియల్’ వేట..
- మున్సిపల్ అధికారుల కళ్లు మూత?
- 300 ఏళ్ల చరిత్రకు తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు
- నిలువనీడ లేక అర్చకులు..
- నిమ్మకు నీరెత్తినట్లు ఎండోమెంట్!
జనవాహిని ప్రతినిధి తాండూరు : శివ భక్తుల కొంగుబంగారం, 300 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ఇప్పుడు అక్రమార్కుల గురైంది. ఆలయ అభివృద్ధి పేరుతో పుణ్యం సంపాదించుకోవాల్సింది పోయి.. దేవుడి మాన్యాన్ని మింగేస్తూ కొందరు కేటుగాళ్లు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలకు తెరలేపారు. ఆధ్యాత్మికత వెల్లివిరియాల్సిన చోట సిమెంట్ కాంక్రీట్ అక్రమ కట్టడాలు వెలుస్తుంటే, అటు మున్సిపల్ అధికారులు, ఇటు దేవాదాయ శాఖ చూసీచూడనట్లు వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు.ఆలయానికి చెందిన విలువైన భూమిలో ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు సాగుతున్నాయి. నియమ నిబంధనలను తుంగలో తొక్కి, పట్టపగలే స్లాబ్‌లు వేస్తూ వ్యాపార సముదాయాలను నిర్మిస్తున్నారు. కనీసం నోటీసులు ఇవ్వాల్సిన మున్సిపల్ అధికారులు ఈ నిర్మాణాలు తమకు కనిపించడం లేదన్నట్లుగా వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో ‘చేతులు మారాయా?’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అర్చకులకు నీడ లేదు.. భక్తులకు వసతి లేదు!
స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించే అర్చకులకు నివసించడానికి సరైన గదులు లేవు. జాతర సమయంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వేలాది మంది భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. భక్తుల సౌకర్యార్థం సత్రాలు కట్టించాల్సిన స్థలంలో, కొందరు స్వార్థపరులు తమ సొంత లాభం కోసం కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి గుడి ఆదాయానికి గండి కొడుతున్నారు.ఆలయ భూముల రక్షణ కోసం పనిచేయాల్సిన ఎండోమెంట్ శాఖ, ఇక్కడ ఆక్రమణదారులకు పరోక్షంగా సహకరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో మొదలైన ఈ ‘వ్యాపార క్రీడ’ భద్రేశ్వరుడి పవిత్రతను దెబ్బతీస్తోంది. ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని, దేవుడి భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై పలువురు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోకపోవడం గమనార్షం.



