
- శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి అయ్యప్ప స్వాముల విరాళం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణంలోని ఇందిరానగర్లో వెలసిన ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ పనులకు అయ్యప్ప స్వాములు తమ వంతు చేయూతను అందించారు. గురువారం పట్టణంలోని బసవన్న కట్ట సమీపంలో గల చిన్ముద్ర అయ్యప్ప స్వాముల ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో ఈ విరాళాన్ని అందజేశారు.ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో, చిన్ముద్ర ఆశ్రమ ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు మరియు భక్తులు కలిసి చందాలు సేకరించారు. సేకరించిన 40 వేల రూపాయల నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దైవకార్యం కోసం భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతకుముందు ఆశ్రమంలో అయ్యప్ప స్వాముల మంత్రోచ్ఛారణలు, భజనల మధ్య మహా పడిపూజ కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరించాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు.



