ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా..!

- రౌడీ రాజకీయం మానుకోండి
- మా బలం ఏంటో చూపిస్తాం –
- సామాన్యులపై అరాచకాలు చెయ్యొద్దు
- బలవతంగా పార్టీ కండువా కప్పుతున్నారు
- రౌడీ వేశాలు మానుకోండి.. లేదంటే….
- తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హెచ్చరిక!
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఎన్నికల నేపథ్యంలో తాండూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నాయకులపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు తమ దౌర్జన్యం, రౌడీ రాజకీయాలను మానుకోవాలని, లేదంటే బీఆర్ఎస్ బలం ఏంటో చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు. తాండూరులో కాంగ్రెస్ నాయకులు అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా..బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి, బెదిరించి బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.పార్టీ అభ్యర్థులను కిడ్నాప్ చేసి, వారిపై దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై రోహిత్ రెడ్డి నిప్పులు చెరిగారు.ఇది పూర్తిగా ప్రజా నిర్ణయంతో జరిగే పంచాయతీ ఎన్నికలని, వాటిని అధికార బలంతో లొంగదీసుకునే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు.కొందరు ఎమ్మెల్యేల వెంట రౌడీ మూకలు తిరుగుతూ బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని, తక్షణమే ఈ ‘రౌడీ రాజకీయం’ ఆపాలని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనోధైర్యాన్ని ఇచ్చారు.కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు అండగా ఉంటా. మా నాయకులను బెదిరించి, దౌర్జన్యం చేసే ఈ అరాచకాలను మేం చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ బలం ఏంటో, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో త్వరలోనే చూపిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
తాండూరులో కాంగ్రెస్ నాయకుల తీరుపై రోహిత్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు రానున్న స్థానిక ఎన్నికల్లో మరింత ఘర్షణ వాతావరణానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి.



