
- మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా అస్తవ్యస్తం!
- ఒకే వార్డులో ఇతర వార్డుల ఓటర్లు.. సవరించాలని అధికారులకు కుర్వ జగదీష్ వినతి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా తీవ్ర గందరగోళంగా ఉందని బీజేపీ యువ నాయకులు కుర్వ జగదీష్ ఆరోపించారు. ఆదివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని అభ్యంతరాల స్వీకరణ కౌంటర్‌లో ఆయన అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ.. పట్టణంలోని సాయిపూర్ పరిధిలో ఉన్న సుమారు మూడు వార్డుల ఓటర్ల జాబితాలో భారీగా తప్పులు దొర్లాయని పేర్కొన్నారు. ఒక వార్డుకు చెందిన ఓటర్లను ఉద్దేశపూర్వకంగానే ఇతర వార్డుల జాబితాలో చేర్చినట్లు ముసాయిదా జాబితా ద్వారా స్పష్టమవుతోందని విమర్శించారు. ఒక్కో వార్డులో దాదాపు 500 నుండి 800 మంది వరకు ఓటర్లను ఇతర వార్డులకు మార్చడం వల్ల స్థానికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ గందరగోళాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ వార్డుకు చెందిన ఓటర్లు అదే వార్డులో ఉండేలా పారదర్శకత పాటించాలని, తుది జాబితా ప్రకటన నాటికి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. తప్పులతో కూడిన జాబితా వల్ల అభ్యర్థులకు, ఓటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి సాయిపూర్ ఓటర్ల జాబితాను తక్షణమే సవరించాలని ఆయన అధికారులను కోరారు.



