ఉప సర్పంచి ఐతే పోలా….!

- రిజర్వేషన్ లేక వార్డ్ మెంబెర్ తో అడ్జెస్ట్
- ఉపసర్పంచ్ కోసం ఆరాటం
- తమ వర్గం, లేదా అనుకూలమైన వ్యక్తి కే సపోర్ట్
- నో టెన్షన్, నో ఖర్చు
- రూటు మార్చిన రాజకీయ నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : గ్రామాల్లో కొందరు సర్పంచ్ అవుదామంటే రిజర్వేషన్ లు ఇతర పరిస్థితులు అనుకూలించక వార్డు సభ్యుడితో సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీనిని అనుకూలంగా మార్చుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. వార్డు సభ్యులుగా నామినేషన్ వేసి గ్రామ పంచాయతీ లోకి అడుగుపెట్టాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ వర్గం లేదా పార్టీకి అనుకూలమైన వారిని గెలిపించుకుంటే ఉపసర్పంచి పదవి తనదేనని ప్రచారం ప్రారంభించారు. దాదాపుగా ఏకగ్రీవం జరిగే వీటికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎటోచి వార్డ్ సభ్యుడిగా గెలిస్తే చాలు..! పలు చోట్ల సర్పంచి స్థానానికి ఇద్దరు పోటీ పడుతుండగా…పార్టీ నాయకత్వం ఇద్దరిలో ఒక్కరిని ఉపసర్పంచి పదవి ఇస్తామని ఒప్పించి రాజీ చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
చెక్ పవర్ కీలకం…!
2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంతో ఆ పదవి గ్రామ పంచాయతీలో కీలకంగా మారింది. గ్రామాభివృద్ధిలో స్పష్టమైన బాధ్యతతో మెలగాల్సి ఉంటుంది. ముఖ్యంగ అక్రమాలను అవకాశం ఇవ్వకుండా అడ్డుకునే అవకాశం దక్కుతుంది. సమష్టి నిర్ణయాలు కాకుండా సర్పంచి ఇష్టారాజ్యంగా చేసే వ్యవహారాలను చెక్ పవర్‌తో అడ్డుకట్ట వేయవచ్చు. అందుకే ఈ పదవిపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.



