ఆగిన గుండెలు, ఆరని కన్నీళ్లు…!

- రక్తమోడుతున్న రహదారులు..
- మృత్యువుకు ముఖద్వారాలు
- చేవెళ్ల గాయం మానకముందే.. నిత్యం మృత్యు ఘంటికలే
- అమ్మానాన్న రాకకోసం.. ఆ పసి హృదయాల ఎదురుచూపు
- కళ్లెదుటే కరిగిపోయిన పేగుబంధం.. తల్లిదండ్రుల కడుపుకోత
- రాలిపోయిన గృహజ్యోతి.. దిక్కులేనిదైన బతుకు
- తాండూరులో మృత్యు విలయం.. రెండు రోజుల్లో ఆరు అనర్థాలు
- ఈ మరణ మృదంగానికి బాధ్యులెవరు?.. ఆ కుటుంబాలకు దిక్కెవరు.
వికారాబాద్ జిల్లా జానవాహిని ప్రతినిధి :
ఒకప్పుడు ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్న వికారాబాద్ జిల్లా, నేడు మృత్యు ఘంటికలకు చిరునామాగా మారుతోంది. రోడ్డు ప్రయాణం అంటేనే ఒక గమ్యం కాదు.. అనంత లోకానికి మార్గమా? అనే భయం ప్రయాణికులను వెంటాడుతోంది. నిత్యం ఏదో ఒక మూల వినిపిస్తున్న ఆర్తనాదాలతో జిల్లా రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.
చేవెళ్ల విషాదం ఇంకా మరువక ముందే..
చేవెళ్ల బస్సు ప్రమాదం మిగిల్చిన గాయం మానకముందే, జిల్లాలో వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆ ఘటన తర్వాత సగటున రోజుకు రెండు ప్రమాదాలు జరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
తాండూరులో మృత్యువిలయం: తాండూరు నియోజకవర్గంలో గత రెండు రోజుల్లోనే 6 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం కలవరపెడుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకం లేకుండా పోయింది.
ఛిద్రమవుతున్న కుటుంబాలు – ఆరని కన్నీటి వ్యధ..!
ఈ ప్రమాదాలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు.. ఒక్కో ప్రమాదం వెనుక ఒక్కో గుండెకోత ఉంది.అమ్మానాన్నలు తిరిగి వస్తారని ఎదురుచూసే పసిపిల్లలు అనాథలుగా మారుతున్నారు. చేతికొచ్చిన బిడ్డలు కళ్లముందే విగతజీవులుగా మారితే, ఆ తల్లిదండ్రుల కడుపుకోతను వర్ణించడానికి మాటలు చాలవు.కట్టుకున్న భర్తను కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడుతున్న భార్యల రోదనలు మిన్నంటుతున్నాయి.
బాధ్యులెవరు? భరోసా ఏది?
ఈ మరణ మృదంగానికి కారకులు ఎవరు? డ్రైవర్ల నిర్లక్ష్యమా? అధికారుల అలసత్వమా? లేక అధ్వాన్నమైన రోడ్లా?ఇంటి పెద్దను కోల్పోయి వీధిన పడ్డ ఆ కుటుంబాలకు అండగా నిలిచేదెవరు? ప్రమాదం జరిగినప్పుడు చేసే హడావిడి తప్ప, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడేదెప్పుడు?అధికారులూ.. పాలకులారా.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. వికారాబాద్ రోడ్లపై ప్రయాణం అంటే ప్రాణసంకటం కాకూడదు. మృత్యువాత పడిన కుటుంబాలకు న్యాయం చేయండి.



