
- రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌లో తాండూరు విద్యార్థిని
- పర్యావరణ హిత ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి..
- సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణంలోని విశ్వవేద హైస్కూల్ విద్యార్థిని ఎం. వర్షిత రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. కామారెడ్డి సమీపంలోని పాత రాజంపేట విద్యానికేతన్ హైస్కూల్ (అబ్దుల్ కలాం ప్రాంగణం)లో జరిగిన 53వ రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఈ ఘనత సాధించింది.వర్షిత ప్రదర్శించిన పర్యావరణ హితమైన ప్రాజెక్టు అందరినీ ఆకట్టుకుంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఆహార ప్యాకేజింగ్, బ్యాగులు, ప్లేట్లు మరియు కప్పుల తయారీపై ఆమె తన పరిశోధనను వివరించింది. ఈ ఉత్పత్తులు సులభంగా భూమిలో కలిసిపోయే (బయోడిగ్రేడబుల్) గుణాన్ని కలిగి ఉండటమే కాకుండా, మట్టి మరియు నీటి కాలుష్యాన్ని నివారిస్తాయి. సాధారణ ప్లాస్టిక్‌తో పోలిస్తే ఇవి పర్యావరణానికి ఎంతో సురక్షితమని వర్షిత తన ప్రాజెక్ట్ ద్వారా నిరూపించింది.ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వర్షితకు కామారెడ్డి ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మెమెంటో అందజేశారు. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించిన వర్షిత, ఈ నెల 18న జరగనున్న ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్’కు తెలంగాణ తరపున ఎంపికైంది.వర్షిత సాధించిన ఈ విజయం పట్ల విశ్వవేద హైస్కూల్ కరస్పాండెంట్ గణేష్ కుమార్, ప్రిన్సిపల్ వెంకటేష్ మరియు డైరెక్టర్ సుజాత సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కూడా వర్షిత రాణించాలని వారు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.



