చేవెళ్ల బస్సు ప్రమాదం లో ట్విస్ట్..!

- లారీ యజమాని నిర్లక్ష్యమే 19 మంది ప్రాణాలు తీసింది!
- కేసులో కీలక మలుపు: చార్జిషీట్‌లో కీలక అంశాలు
- తప్పు యజమానిది.. శిక్ష 19 మందికా?
జనవాహిని డెస్క్: నవంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చేవెళ్ల బస్సు ప్రమాద కేసులో పోలీసుల విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ ఘోర ప్రమాదానికి టిప్పర్ లారీ ఓవర్‌లోడ్ మాత్రమే కారణమని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ కేసులో లారీ యజమాని లచ్చు నాయక్ ను ప్రధాన నిందితుడిగా (A1) చేరుస్తూ పోలీసులు చార్జిషీట్ సిద్ధం చేశారు.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్ లారీలో సామర్థ్యానికి మించి లోడ్ ఉంది. రోడ్డుపై ఉన్న ఒక గుంతను తప్పించే క్రమంలో, ఓవర్‌లోడ్ వల్ల బ్యాలెన్స్ తప్పిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. కేవలం రోడ్డు పరిస్థితి మాత్రమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారమైన లోడ్‌తో వేగంగా వెళ్లడం వల్లే 19 మంది ప్రాణాలు గాల్లో కలిశాయని నిర్ధారణ అయ్యింది.ప్రమాద సమయంలో లారీ యజమాని లచ్చు నాయక్ కూడా అదే లారీలో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తన కళ్లముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా వారించకపోగా, ప్రమాదానికి పరోక్షంగా బాధ్యుడైనందున అతడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.





