అంతారం పంచాయతీలో అధికారిక కుట్ర..!

- సర్పంచు ఎన్నికల ఫలితాలపై రగడ!
- అంతారం పంచాయతీ ఎన్నికల్లో చీకటి ఒప్పందం!
- సర్పంచ్’ కుర్చీ కోసం ప్లాన్
- పంచాయతీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల ‘మోసం’,
- తెర వెనుక సీనియర్ నేత!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మండల పరిధిలోని అంతారం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. సర్పంచు ఎన్నికల ఫలితాలలో మోసం జరిగిందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారిపైనే తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ, సర్పంచు మరియు ఉప సర్పంచు పదవులు బీఆర్ఎస్ మద్దతుదారులకు దక్కకుండా చేయాలని ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల అధికారిపైనే అధిక అనుమానం
సర్పంచు ఎన్నికల ఫలితాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న గ్రామస్తులు, దీని వెనుక ఎన్నికల అధికారి హస్తం ఉందని బలంగా నమ్ముతున్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసి, తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫలితాల రికార్డులు సీజ్ చేసి.. రీకౌంటింగ్‌కు డిమాండ్
ఫలితాలలో అక్రమాలు జరిగాయని గట్టిగా నమ్ముతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు తక్షణమే ఎన్నికల ఫలితాలకు సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, పోటీ చేసిన అభ్యర్థులందరి సమక్షంలో ఓట్ల లెక్కింపును (రీకౌంటింగ్) మళ్లీ నిర్వహించాలని వారు కలెక్టర్‌ను కోరారు.
బోగస్ ఓట్ల వినియోగం వెనుక సీనియర్ నేత హస్తం?
ఈ వివాదంలో కేవలం ఎన్నికల అధికారులే కాకుండా, స్థానికంగా ఉన్న ఒక సీనియర్ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. సదరు నేత అండదండలతోనే ఎన్నికలలో బోగస్ ఓట్లను వినియోగించి, ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం జరిగిందని వారు కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదులో స్పష్టం చేశారు.బీఆర్ఎస్ పార్టీ నేత, గ్రామస్తుల నుండి ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఈ అంశంపై పూర్తి విచారణ జరిపించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.



