posted on Sep 18, 2024 5:56PM
వైసీపీ ఆవిర్భావం నుంచి తాజా ఓటమి వరకూ ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ జగనే. జగన్ రాజకీయ అరంగేట్రం చేయడానికి ముందు నుంచీ రాజకీయాలలో కొమ్ములు తిరిగిన నేతలుగా ఉన్న వారు కూడా జగన్ పార్టీలోకి వచ్చే సరికి చేతులు కట్టుకుని నిబడి జగన్ ఏం చెప్పినా ఎస్ బాస్ అనాల్సిన పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల నేతలను దూషించమంటే దూషించాలి. ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలపై దాడులు చేయాలంటే చేయాలి. అంతే. అందుకు భిన్నంగా చేయడానికి అవకాశమే లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా జగన్ హయాంలో డమ్మీలుగా మిగిలిపోయారు. పార్టీలో నంబర్ వన్ నుంచి చివరి వరకూ అంతా జగనే అన్నట్లు నడిచింది. రెండేళ్ల కిందట పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించి.. అప్పటికి పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను సగౌరవంగా పదవి నుంచీ, పార్టీ నుంచీ సాగనంపి మరీ జగన్ తనను తాను పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. మరో గత్యంతరం లేక పార్టీ మొత్తం జగన్ పార్టీ శాశ్వత అధ్యక్షుడంటూ ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టి ఆమోదించింది. అయితే ఆ తరువాత ఈసీ ఆ ఎన్నిక చెల్లదని తేల్చేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సిందేనని స్పష్టం చేయడంతో ఆ శాశ్వత అధ్యక్ష ముచ్చట మూన్నాళ్లకే ముగిసింది అది వేరే సంగతి.
ఇక ప్రస్తుతానికి వస్తే ఈ ఏడాది జూన్ లో జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని అందుకుంది. కనీసం విపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించి రాష్ట్రంలో నామమాత్రంగా మిగిలింది. ఈ పరాజయం తరువాత వైసీపీలో జగన్ నాయకత్వానికి అంత వరకూ ఉన్న సర్వ సమ్మతి లేకుండా పోయింది. ఆయనకు సన్నిహితులుగా మెలిగిన వారు సైతం పార్టీని వీడారు. ఇక జగన్ ఆడమన్నట్లల్లా ఆడి, పాడమన్నట్లలా పాడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ , అనీల్ కుమార్ యాదవ్ వంటి వారు పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాల్లో కలికానిక్కూడా కనిపించడం లేదు.
ఇక పార్టీలో ఉన్న వారు కూడా గతంలోలా జగన్ కు తానా అంటే తందానా అనేందుకు సిద్ధంగా లేరు. చివరాఖరికి సీనియర్ నేత.. మేకపాటి రాజమోహన్ రెడ్డి అయితే జగన్ మాటను ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. అసలాయన జగన్ లేక్కేమిటన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా బెజవాడను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఆ సందర్భంగా వరద బాధితుల సహాయం కోసం సీఎం రిలీఫ్ పండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువెత్తాయి. రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారూ సీఎంఆర్ఎఫ్ కు వారాళాలిచ్చారు. సెలిబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ తమకు తోచిన విధంగా వరద బాధితుల కోసం తమ వితరణను చాటారు.
అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం తమ పార్టీకి చెందిన ఎవరూ కూడా సీఎంఆర్ఎఫ్ కు విరాళం ఇవ్వడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ వరద బాధితుల కోసం స్వయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అయితే ఆ విరాళాన్ని సీఎంఆర్ఎఫ్ కు పంపబోననీ, పార్టీ తరఫున తానే వరద బాధితులను ఆదుకుంటానని ప్రకటించి.. ఓ రెండు రోజుల పాటు హడావుడి చేశారు. ఆ తరువాత ఓ రెండు ఆటోలలో వరద బాధితులకు సరుకులను పంపిణీ చేసి కోటీ ఖర్చు అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. లక్షల మంది వరద బాధితులకు జగన్ ప్రకటించి, ఖర్చు చేసిన కోటి రూపాయలతో అందించిన సహాయమేమిటో ఎవరికీ తెలియదు. దానికి లెక్కా పత్రం ఉంటుందని ఎవరూ భావించరు. లెక్కలు చెప్పమని అడిగే వారూ లేరు. కానీ ఎంత రాజకీయాలలో ఉన్నా మేకపాటి వ్యాపారవేత్త, ఆయన ఓ పెద్ద కనస్ట్రక్షన్ కంపెనీ యజమాని. కనుక స్వతగాహా అన్ని విషయాల్లోనూ లెక్కా పత్రం జవాబుదారీ తనం ఉండాలని కోరుకుంటారు. అందుకే జగన్ హుకుంను బేఖాతరు చేసి వరద బాధితుల కోసం తన సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ కే పంపారు. పాతిక లక్షల రూపాయల చెక్కును స్పీడ్ పోస్టు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికే పంపించారు. అంటే గతంలోలా పార్టీలో ఇక నీ మాట చెల్లుబాటు కాదు అని మేకపాటి జగన్ కు చెప్పకనే చెప్పారన్న మాట.