posted on Sep 18, 2024 1:11PM
సాధరణంగా ‘ఊరకరారు మహానుభావులు’ అనే మాట ఉపయోగిస్తూ వుంటాం. మన ప్రధానమంత్రి మోడీ గారి విషయంలో మాత్రం ‘ఊరక వెళ్ళరు మహానుభావులు’ అనే కొత్త పదాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే, ప్రధాని మోడీ అతి త్వరలో అమెరికా యాత్ర చేయబోతున్నారు. ఇందులో కొత్త విషయం ఏముంది? మోడీ గారు విదేశాలకు వెళ్ళడం, ఏ దేశం వెళ్తే ఆ దేశం అధ్యక్షుడినో, ప్రధానమంత్రినో గాఠ్ఠిగా కౌగలించుకోవడం, మన దేశంలో మీడియా ఆ ఫొటోలు పెద్దపెద్దగా ప్రచురించి, ప్రపంచ మొత్తాన్నీ నడిపేంచే శక్తి గల ‘విశ్వగురు’ మన మోడీ గారు అని కీర్తించడం మామూలేగా అనుకుంటున్నారు కదూ? అయినప్పటికీ, ఈ మామూలు విషయాన్నే మరోసారి మామూలుగా చర్చించుకుందాం.
త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు బైడన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. ఆయన పార్టీకే చెందిన కమలా హ్యారిస్ అధ్యక్ష పోటీలో నిలిచారు. అలాగే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పోటీలో వున్నారు. అమెరికా ఎన్నికలలో కొన్ని ప్రాంతాల్లో ప్రవాస భారతీయుల ఓట్లు బాగా ప్రభావం చూపుతాయి. పైగా ఈసారి ఎన్నికలలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ బరిలో వున్నారు. ఇలాంటి సందర్భంలో మోడీ అమెరికా వెళ్తే ఆయనకు లభించే గౌరవమే వేరు.
మోడీ అమెరికా టూర్ వుందనే విషయం తెలియగానే, డోనాల్డ్ ట్రంప్ వెంటనే స్పందించారు. మోడీ అమెరికా రాగానే తప్పకుండా కలుస్తాను అని ప్రకటించారు. దానికి అర్థం ఏమిటంటే, మోడీతో చాలా సన్నిహితంగా మెలగటం ద్వారా తాను ఇండియాకి స్నేహితుడినని, తాను అధ్యక్షుడు అయితే అమెరికాలో వున్న ఎన్నారైలకు ఎంతో మంచి చేస్తానన్న సందేశాన్ని వ్యాపింపజేస్తారు. అలాగే బైడెన్, కమలా హ్యారిస్ కూడా మోడీని బాగా గౌరవించడం ద్వారా ఎన్నారైల మెప్పు పొందాలని కోరుకుంటారు. ఇలాంటి సందర్భంలో అమెరికా వెళ్తే మోడీకి రెండు పక్షాల నుంచి లభించే గౌరవ మర్యాదలు మామూలుగా వుండవు. ఆ గౌరవ మర్యాదలను మన ఇండియాలో మీడియా ఏరకంగా ప్రొజెక్టు చేస్తుందో చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. మోడీ గారు అమెరికా వెళ్తే అమెరికా అధ్యక్షుడితోపాటు అధ్యక్ష పోటీలో వున్న ఇద్దరు అభ్యర్థులూ మోడీని ఎంతో గౌరవించారు. ఇదీ మోడీ గారి లెవల్ అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అందుకే మనం ‘ఊరక వెళ్ళరు మహానుభావులు’ అనుకోవాలి.