Saturday, November 30, 2024

జ‌త్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ లు ఔట్‌ .. సీఎంవో కార్యాల‌యంలో ఏం జ‌రిగిందంటే? | three ips officers suspended in jathwani case| former| inteligence| chief| psranjaneyulu| krantirana tata| vishal

posted on Sep 16, 2024 7:01AM

పాపం పండింది.. మ‌హిళ ప‌ట్ల నీచంగా వ్య‌వ‌హ‌రించిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌పై వేటు ప‌డింది. వైసీపీ  హ‌యాంలో కొంద‌రు  ఐపీఎస్ అధికారులు  మ‌హిళ‌ల ప‌ట్ల‌ నీచంగా ప్ర‌వ‌ర్తించారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ పెద్ద‌ల సూచ‌న‌ల‌తో తాము ఉన్న‌తస్థాయి అధికారుల‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయి వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రించారు.  తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి జైళ్ల‌కు పంపించారు. అంత‌టితో ఆగ‌కుండా లాఠీల‌తో కుళ్ల‌ పొడిచారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు వైసీపీ ప్ర‌భుత్వంలో హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించిన ఐపీఎస్‌ల పై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ముంబై న‌టి కాదంబ‌రి జ‌త్వానీ కేసులో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌త్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జ‌త్వానీ ఫిర్యాదు మేర‌కు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. ఇక, విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను కూడా ఏపీ ప్ర‌భుత్వం రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసింది. 

గ‌త నెల‌లో ముంబై న‌టి జ‌త్వాని ఏపీ పోలీసుల‌ను క‌లిశారు. త‌న‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని, త‌న‌ను ఇబ్బంది పెట్టిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ముంబైలో తాను పెట్టిన కేసును వెనక్కు తీసుకునేందుకు తనపై విజయవాడలో అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. కుక్కల విద్యాసాగర్‌ అనే వైసీపీ నాయకునితో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో అక్రమ కేసు పెట్టించి తనను, త‌న‌ తల్లిదండ్రులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపి ముంబై కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశార‌ని న‌టి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల సిఫార్సుతో రంగంలోకి దిగిననాటి ఇంటెలిజెన్స్ డీజీపీ పీఎస్సార్‌, అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్ని కనుసన్నల్లో పోలీసులు వ్యవహరించారని, తెర వెనుక పథకం రచించి పీఎస్సార్‌ కథ నడిపించారని న‌టి ఆరోపించారు. న‌టి ఆరోప‌ణ‌ల‌పై నిజానిజాల‌ను నిగ్గుతేల్చేందుకు డీజీపీ ద్వార‌క తిరుమ‌ల‌రావు విచార‌ణ‌కు ఆదేశించారు. విచారణాధికారి స్రవంతి రాయ్‌ ఎదుట బాధితురాలు వెల్లడించిన అంశాలకు సంబంధించిన నివేదిక విచార‌ణ అధికారి ద్వారా డీజీపీకి చేరాయి. మూడు రోజుల క్రితం ఆ నివేదిక‌ను డీజీపీ ప్ర‌భుత్వానికి నివేదించారు. ఈ నివేదికలో సదరు ముగ్గురు ఐపీఎస్‌ల ప్రమేయాన్ని స్పష్టంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీంతో ఆ ముగ్గురినీ సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు. 

న‌టి జ‌త్వానీ కేసులో విశాల్‌ గున్నిని సస్పెండ్‌ చేయడానికి కారణాలను జీవోలో ప్రభుత్వం పేర్కొంది. జ‌త్వానీపై విజ‌య‌వాడ ఇబ్ర‌హింప‌ట్నం పోలీస్ స్టేష‌న్ లో 2024 ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదైంది. అయితే.. ప్రాథమిక విచారణ జరపకుండానే నటి జత్వానీని అరెస్ట్‌ చేసేందుకు విశాల్ గున్ని సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా అప్పటి ఇంటెలిజెన్స్‌ డీజీపీ సీతారామాంజనేయులను 2024 జనవరి 31న సీఎంవో కార్యాల‌యంలో కలిశారు. ఆయన మౌఖిక ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 2న ముంబై వెళ్ళారు. అదేరోజు ఉద‌యం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఏడున్నర గంటలకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అధికారిక రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే బయలుదేరి ముంబై వెళ్ళారు. డీసీపీ హోదాలో అధికారిక విధుల కోసం వెళ్ళిన గున్నీ కనీసం అందుకు సంబంధించి ట్రావెల్‌ అలెవెన్స్‌ను ప్రభుత్వం నుంచి క్లెయిమ్‌ చేసుకోకపోవడాన్ని డీజీపీ నివేదిక  ఆక్షేపించింది. అదే విధంగా నటి అరెస్ట్‌ చేసే విషయంలో కనీసం వారికి ముందుగా తెలియ చేయ‌లేదు.  నిబంధనలు పాటించలేదు. ఇదంతా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్‌, అప్పటి విజయవాడ  సీపీ కాంతిరాణా మౌఖిక ఆదేశాలతో చేసినట్లు నివేదిక పేర్కొంది.  సస్పెండ్ అయిన విశాల్‌ గున్ని విజయవాడ, హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విజ‌య‌వాడ విడిచి వెళ్లరాదని ప్రభుత్వం జీవోలో ఆదేశించింది.

అయితే, ప్ర‌భుత్వం ఇచ్చిన మూడు జీవోల‌ను ప‌రిశీలిస్తే.. ముంబై న‌టి కాదంబ‌రి జ‌త్వానిని అరెస్టు చేసింది 2024 ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన. అంత‌కంటే రెండు రోజుల ముందు జ‌న‌వ‌రి 31వ తేదీన ఇటెలిజెన్స్ డీజీపీ సీతారామాంజ‌నేయులు, విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా, డీసీపీ విశాల్ గ‌ున్నిలు సీఎంఓలో భేటీ అయ్యారు. జ‌త్వానిని అరెస్టు చేసి తీసుకురావాల‌ని సీతారామాంజ‌నేయులు కాంతిరాణా, విశాల్ గ‌న్నిల‌కు సూచించారు. అయితే, సీఎంఓ కార్యాల‌యంలో  వీరు భేటీ కావ‌డానికి కార‌ణం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.  సీఎంవోలో వీరు భేటీ కావడంతో  జత్వానీ అరెస్టు  వెనుక వైసీపీ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. అప్ప‌ట్లో వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి ఇందులో ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలిసే ఈ వ్య‌వ‌హారం జ‌రిగింద‌ని తెలుగుదేశం నేత‌లు అంటున్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు జ‌త్వాని కేసును సీరియ‌స్ గా తీసుకోవ‌డంతో.. మున్ముందు కాలంలో ఈ కేసులో ప్ర‌మేయం ఉన్న‌వారు సైతం కటకటాల పాలు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana