posted on Sep 14, 2024 12:17PM
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మానసిక ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నది ఒక ఆరోపణ. జగన్మోహన్‌రెడ్డి ఒక్క ఛాన్స్ అని రిక్వెస్ట్ చేసి అధికారంలోకి వచ్చి, ఐదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరకం చూపించి వుండవచ్చు… జగన్‌తోపాటు ఆయన పార్టీ నాయకులు లక్షల కోట్ల రూపాయలు గుటకాయస్వాహా చేసి వుండొచ్చు. ఇసుక, మట్టి లాంటి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుని వుండొచ్చు. తప్పుడు కేసులు పెట్టి ఎంతోమందిని… సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించి వుండొచ్చు. రఘురామకృష్ణంరాజు దగ్గర్నుంచి ముంబై హీరోయిన్ వరకు ఎంతోమందిని చిత్రహింసలకు గురిచేసి వుండొచ్చు. జగన్ పరిపాలించిన ఐదేళ్ళకాలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల చేతిలో ఎన్నో వందల మంది హత్యకు గురై వుండవచ్చు. ఎంతోమంది ప్రతిభావంతులైన అధికారులను కులాన్ని సాకుగా చూపించి వేధింపులకు గురిచేసి వుండొచ్చు. బటన్ నొక్కుతా అంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చి వుండవచ్చు. జగన్‌తో సహా వైసీపీ నాయకులు చాలామంది తమ మాటలతో, చేతలతో నీతి నియమాలను, నైతిక విలువలను సర్వనాశనం చేసి వుండవచ్చు… అయినప్పటికీ, ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన భద్రత విషయంలోగానీ, ఆరోగ్యం విషయంలోగానీ ప్రభుత్వం ఎలాంటి లోటు చేయడానికి వీలు లేదు. అలా లోటు చేయడానికి ప్రయత్నించడం కూడా భావ్యం కాదు.
జగన్‌కి గతంలో 986 మంది సిబ్బంది సెక్యూరిటీగా వుండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ సిబ్బందిని 58 మందికి తగ్గించారు. అధికారంలో వున్నంతకాలం 986 మంది సిబ్బంది కల్పించిన సెక్యూరిటీతో ఆయన నిశ్చింతగా వుండేవారు. ఆ నిశ్చింతలోనే అద్భుతమైన ఆలోచనలు చేసి బటన్లు నొక్కుతూ వుండేవారు. అలాంటి మనిషికి కేవలం 58 మందితో సెక్యూరిటీ ఇవ్వడం ఎంతవరకు భావ్యమో ప్రభుత్వం ఆలోచించాలి. అదేంటంటే, ప్రభుత్వాధికారులు రూల్స్ ప్రకారమే వ్యవహరించాం అంటారు. గత ఐదేళ్ళుగా ఏ రూల్సూ పాటించని జగనన్నని ఇప్పుడు కొత్తగా రూల్స్ చట్రంలో ఇరికించాలని చూడటం ప్రభుత్వానికి న్యాయమా? కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచించి అంతగా అవసరం అనుకుంటే గతంలో వున్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒక్కర్నో, ఇద్దర్నో తగ్గించి 980 ప్లస్ సిబ్బందితో సెక్యూరిటీ అందించాలి. జగన్ తాడేపల్లి ఇంటి దగ్గర అంతకు ముందు వున్న సెక్యూరిటీ ఏర్పాట్లు తగ్గించారు కాబట్టే ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే.
అలాగే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాల్సిన సమయం వచ్చింది. అదేంటంటే, అధికారం పోవడం వల్ల జగన్‌కి మెంటల్ ఎక్కింది అని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. మెంటల్ ఎక్కడం వల్లే జగన్ పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. నిన్నగాక మొన్న జగన్ పిఠాపురం వెళ్ళి మీడియా ముందు ‘‘ఈ పాపకి పదిహేను వేలు… ఈ బాబుకు పదిహేను వేలు.. ఇలారా.. ఇలారా’’ అంటూ విచిత్రంగా ప్రవర్తించిన సంఘటనను కూడా వాళ్ళు సాకుగా చూపిస్తున్నారు. ఇలా విచిత్రంగా ప్రవర్తించినంత మాత్రానికే ‘అధికారం పోయినందువల్ల జగన్‌కి మెంటలెక్కింది’ అనడం కరెక్ట్ కాదు కదా? జగన్ ఇలా విచిత్రంగా ప్రవర్తించడం అధికారం పోయినందువల్ల కాదు అనే విషయాన్ని ఈ విమర్శలు చేస్తున్నవారు గ్రహించాలి. ఎందుకంటే, జగన్ అధికారంలో వున్నప్పుడు కూడా ఇలా విచిత్రంగా ప్రవర్తించేవారు. అందువల్ల జగన్ ప్రవర్తనకి, అధికారం పోవడానికి సంబంధం లేదన్న విషయాన్ని జగన్‌ని విమర్శిస్తున్నవాళ్ళు తెలుసుకుంటే మంచిది. వరద బాధితులను పరామర్శించడానికి పిఠాపురం వెళ్ళిన జగన్, అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడ్డం జగన్‌కి ఎక్కిన పిచ్చికి పరాకాష్ట అని కూడా పరుష పదాలు వాడుతున్నారు. ఇది ఎంతమాత్రం క్షమించరాని విషయం. ఎలా వుండే మనిషి ఎలా అయిపోయాడని జాలి చూపించాలే తప్ప ‘మెంటల్’ అనడమేంటి? తప్పు కదా?
‘మెంటల్’ లాంటి దారుణమైన మాటలు ఉపయోగించడం కరెక్ట్ కాదు.. అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో అస్సలు కరెక్ట్ కాదు. జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలి ఆయనకు మానసికంగా ఏవో సమస్యలు వున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్న మాట వాస్తవమే. అయితే అది పూర్తిగా సానుభూతితో పరిశీలించాల్సిన అంశం. తనకు మానసిక సమస్యలు వున్నాయని జగన్‌కి కూడా తెలిసే వుంటుందని, అందుకే ఆయన లండన్ మందులు వాడుతున్నారని, ఆ మందుల కోసం, ట్రీట్‌మెంట్ కోసమే జగన్ లండన్ టూర్‌కి వెళ్తూ వుంటారనే అభిప్రాయాలు వున్నాయి. జగన్‌ని ఎంతో అభిమానించే సీమరాజా కూడా ఈ విషయాన్ని చెబుతూ వుంటారు. తనకు మానసిక సమస్యలు వున్నాయని తెలుసుకుని, వాటిని తగ్గించుకోవడానికి అధికారంలో వున్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్న జగన్‌ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ఎంతవరకు సబబో అధికార పార్టీ నాయకులే ఆలోచించుకోవాలి.
అప్పుడెప్పులో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే జగన్ లండన్ వెళ్ళారు. ఇప్పటికి మూడు నెలలు అయిపోయాయి. పాపం ఆయన మళ్ళీ తన రొటీన్ చెకప్ కోసమో, మందుల కోసమో లండన్ టూర్ పెట్టుకున్నారు. ఆయన దారిన ఆయనని వెళ్లనివ్వకుండా పాస్‌పోర్టు కేసు క్రియేట్ చేసి లండన్ టూర్‌కి బ్రేక్ వేశారు. మందులు అయిపోవడం వల్ల ఆయన పిఠాపురంలోగాని, విజయవాడలోగానీ, జైళ్ళ దగ్గర గానీ విచిత్రంగా ప్రవర్తిస్తే ప్రవర్తించి వుండొచ్చు. ఆ ప్రవర్తనని సానుభూతిలో అర్థం చేసుకోవాలే తప్ప వేరే రకంగా ఆలోచించడం మాత్రం చాలా తప్పు. ఆయన దారిన ఆయన లండన్ వెళ్తుంటే ఆపేదీ మీరే.. ఇప్పుడు ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తుంటే విమర్శించేదీ మీరే… ఇదెక్కడి న్యాయమయ్యా?
నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆరోగ్య బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. జగన్ మానసిక ఆరోగ్యం బాగుపడటానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. జగన్ మానసిక చికిత్స అనేది నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే చరిత్ర క్షమించదు. అమ్మ పెట్టదు.. అడుక్కుని తిననివ్వదు అన్నట్టు.. ప్రభుత్వం ట్రీట్‌మెంట్ చేయించదు.. ఆయన దారిన ఆయన లండన్ వెళ్తుంటే అవరోధాలు క్రియేట్ చేస్తుంది. ఇదెక్కడి సంస్కారం? అందువల్ల ఆ లండన్ టూర్ ఖర్చులు, మెడికల్ చెకప్పుల ఖర్చులు, మందుల కొనుగోలు ఖర్చులు… ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా భరించాలి. జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా ఎలా నాశనం చేయాలా? రాజధాని అమరావతిని ఇంకా ఎలా భ్రష్టు పట్టించాలా? పోలవరాన్ని ఇంకా పనికిరాకుండా ఎలా చేయాలా? ఇంకా నేరాలూ ఘోరాలు ఎలా చేయాలా, ప్రకృతిని ఇంకా ఎలా ధ్వంసం చేయాలా అని ఆలోచించీ ఆలోచించి బ్రెయిన్లో ఫిలమెంట్ ఎగిరిపోయి వుండొచ్చు. అధికారంలో వున్నప్పుడే జగన్ బ్రెయిన్ ఫిలమెంట్ ఎగిరిపోయింది కాబట్టి, ఆ ఫిలమెంట్‌ని బాగు చేయాల్సిన బాధ్యత నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వానిదే. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. జగన్ సెక్యూరిటీ విషయంలో, మానసిక ఆరోగ్యం విషయంలో మొండి పట్టుదలకు పోకుండా సానుభూతితో వ్యవహరించాలి. ఒకవేళ లండన్ రేంజ్‌లో ట్రీట్‌మెంట్ చేయించడానికి బడ్జెట్ లేకపోతే, జగన్‌కి ఎంతో ఇష్టమైన, జగన్‌కి మాత్రమే రాజధాని అయిన వైజాగ్‌లో అయినా ట్రీట్‌మెంట్ చేయించాలి. తన బాధ్యతను నిర్వర్తించాలి.