posted on Sep 11, 2024 11:23AM
వైసీపీ ఖాళీ అయిపోతుందా? ఆ పార్టీ నుంచి వలసలను ఆపడం జగన్ వల్ల కావడం లేదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వైసీపీ అధికారం ఉన్నంత కాలం పెత్తనం చెలాయించిన నేతలు సైలెంట్ అయిపోయారు. ఒకరిద్దరు ఇప్పటికీ తెలుగుదేశం కూటమి సర్కార్ పై నోరు పారేసుకుంటున్నా.. వారిని జనం పట్టించుకోవడం లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు పలువురు రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉంటున్నారు. మారదామన్నా వారికి చోటిచ్చే పార్టీ లేకపోవడంతో ప్రస్తుతానికి మౌనమే మేలని మిన్నకుంటున్నారు. ఇక పలువురు ఇప్పటికే పార్టీని వీడి అవకాశమున్న పార్టీల్లో సర్దుకున్నారు. పదవులు, హోదా గురించి మాట్లాడకుండా చోటిస్తే చాలన్నట్లుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ గూటికి చేరడానికి రెడీ అయిపోతున్నవారు మరి కొందరు ఉన్నారు.
రాజ్యసభలో బలం ఉందంటూ భుజాలెగరేస్తున్న జగన్ కు అక్కడా గండి పడింది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావులు రాజీనామా చేయగా, ఇంకా పలువురు అదే బాటలో ఉన్నారనీ, ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో టచ్ లోకి వెళ్లారనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అలాగే శాసనమండలిలో కూడా వైసీపీకి ఉన్నది బలం కాదు వాపు అని తేలిపోయింది. జగన్ ను ధిక్కరించేందుకు పలువురు ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ఢిల్లీ ధర్నాకు డుమ్మా కొట్టి ఇద్దరు ఎమ్మెల్సీలు మండలికి హాజరయ్యరని, ముందు ముందు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా జగన్ కు ఝలక్ ఇవ్వడం ఖాయమన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది.
ఇక తాజాగా జగన్ పార్టీకి దూరం అవుతున్న వారి జాబితాలో జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరిపోయారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమే అనడానికి గత కొద్ది కాలంగా సామినేని ఉదయభాను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటమే తార్కాణమంటున్నారు పరిశీలకులు.
అయితే ఉదయభానుకు వైసీపీ అధికారంలో ఉండగా జనసేనకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచారం ఇప్పుడు అవరోధంగా మారుతోంది. జనసేన శ్రేణులు ఉదయభానును పార్టీలో చేర్చుకోవద్దంటూ పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారంటున్నారు. గతంలో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో జనసేన ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను ఉదయభాను ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ధ్వసం విషయాన్ని జనసేన కార్యకర్తలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. నాడు దిమ్మె ధ్వంసంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించిన ఉదయభానును పార్టీలో ఎలా చేర్చుకుంటారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ తోడు జనసేనలో చేరడానికి ఉదయభాను కొన్ని కండీషన్లు పెట్టారనీ, వాటిలో ప్రధానంగా తనకు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షపదవి ఇవ్వాలనీ కోరుతున్నారని అంటున్నారు. దీనిని కూడా జనసైనికులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం మీద సామినేని ఉదయభానుకు జనసేనలో ఎంట్రీ వచ్చినా రాకున్నా ఆయన మాత్రం వైసీపీని వీడడం ఖాయమైందని పరిశీలకులు చెబుతున్నారు.