posted on Sep 11, 2024 3:32PM
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు యోచిస్తున్నారా? అంటే తెలుగుదేశం వర్గీయుల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. వైసీపీ హయాంలో కక్షసాధింపు రాజకీయాలతో విసిగివేసారిపోయిన గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి వందల, వేల కోట్ల పన్ను చెల్లిస్తూ కూడా ప్రభుత్వాల వేధింపులకు గురికావలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగన్ సర్కార్ రాజకీయ వేధింపుల కారణంగా గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆగలేదు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న అమరరాజా బ్యాటరీస్ సంస్థను కూడా రాష్ట్రం నుంచి తరలించేశారు.
కేవలం రాజకీయ కక్ష సాధింపు, వేధింపులు తప్ప మరోటి తెలియని జగన్ కు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ గా నిలిచి, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా గుర్తింపు పొందిన అమరరాజా బ్యాటరీస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేయడమంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలువులోతు గొయ్యి తీసి కప్పెట్టేయడమేనని తెలిసినా, రాష్ట్రం కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత కక్ష సాధింపులే ముఖ్యంగా భావించారు. అందుకే అధికారంలో ఉన్నామన్న అహంతో ట్యాక్స్ రూపంలో ఏపీ ప్రభుత్వానికి ఏటా సుమారు 1200 కోట్ల మేర పన్నులు కడుతున్న అక్షయ పాత్రలాంటి కంపెనీ రాష్ట్రం తరిలిపోయేలా చేశారు. అసలా కంపెనీని మూయించడమే లక్ష్యంగా జగన్ తాను అధికారంలో ఉండగా పావులు కదిపారు. ఆ పని చేసేసే వారే అయితే కంపెనీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మరీ జగన్ యత్నాలను అడ్డుకుంది. నిబంధనలన్నీ పక్కాగా ఫాలో అవుతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీ అయిన అమరరాజా బ్యాటరీస్ పై అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కాలుష్యం పేరుతో మూయించాలని చూడటం వెనుక ఉన్నది రాజకీయమేనని అప్పట్లోనే పారిశ్రామికవర్గాలు గగ్గోలు పెట్టాయి.
అయినా అధికార అహంతో కన్నూమిన్నూగాకుండా వ్యవహరించిన జగన్ సర్కార్ కంపెనీ మూసివేయించేయాలన్న పట్టుదలతో అడుగులు వేసింది. అయితే అమరరాజా సర్కర్ కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ దుష్టయత్నాన్ని చట్టపరంగా ఎదుర్కొంది. అయితే ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తున్న తీరుతో విసిపిపోయిన అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం ఏపీకి గుడ్ బై చెప్పేసి పొరుగు రాష్ట్రం తెలంగాణకు తరలిపోయింది. ఇక్కడి సర్కార్ బంగారుబాతు లాంటి అమరరాజా బ్యాటరీస్ ను తరిమిగొడితే తెలంగాణ సర్కార్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించింది.
వాస్తవానికి గల్లా జయదేవ్ కు అమరరాజా బ్యాటరీస్ కు ఉన్న అనుబంధం అంతా ఇంత అని చెప్పలేం. రాష్ట్ర విభజన తరువాత తాము చెల్లించే పన్నులు.. తమ సొంత రాష్ట్రానికే దక్కాలనే కారణంతో అమరరాజా బ్యాటరీస్ తన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తిరుపతికి తరలించింది. అలాంటి కంపెనీని జగన్ సర్కార్ రాష్ట్రం నుంచి తరిమేసింది.
ఇలా ఏపీ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ, ఉపాధి, సామాజిక సేవలో ఎంతో తోడ్పాటు అందిస్తున్న అమరరాజా కంపెనీని గల్లా జయదేవ్ తెలుగుదేశం ఎంపీ అన్న ఏకైక కారణంతో వేధించి రాష్ట్రం నుంచి తరిమేసింది. జగన్ సర్కార్ వేధింపులతో విసిగిపోయిన గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువు దీరిన తరువాత ఒకింత చురుకుగా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గల్లా జయదేవ్ కు సముచిత స్థానం ఇచ్చి, రాజ్యసభ సభ్యుడిగా పంపి ఆయన సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.
వైసీపీ నుంచి ఇటీవల ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికి మెపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిరువురిలో మోపిదేవి వెంకటరమణ స్థానంలో గల్లా జయదేవ్ ను రాజ్యసభక పంపాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. మంచి వక్త అయిన గల్లా జయదేవ్ ను రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తే తెలుగుదేశం తరఫున రాజ్యసభలో బలంగా గొంతెత్తగలరన్న భావన తెలుగుదేశం వర్గాలలో కూడా వ్యక్తం అవుతోంది.