రాజమౌళి(Rajamouli)తో సినిమా చేసిన హీరోకి తదుపరి చిత్రంతో పరాజయం ఎదురవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటిదాకా ఆ సెంటిమెంట్ నుంచి ఏ హీరో తప్పించుకోలేకపోయాడు. దీంతో ‘దేవర'(Devara)తోనైనా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అయితే కొందరు హీరోలకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాతే కాదు.. చేయడానికి ముందు కూడా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్(Ram Charan)లతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని రూపొందించాడు రాజమౌళి. ఆ సినిమాకి ముందు ‘అరవింద సమేత’తో ఎన్టీఆర్ విజయాన్ని అందుకోగా, ‘వినయ విధేయ రామ’ రూపంలో చరణ్ కి మాత్రం భారీ షాక్ తగిలింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఫిల్మ్ 2019 సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu)కి కూడా ఇంచుమించు అలాంటి షాకే తగిలింది.
రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఆ భారీ ప్రాజెక్ట్ తో బిజీ కావడానికి ముందు మహేష్ నటించిన చిత్రం ‘గుంటూరు కారం'(Guntur Kaaram). త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వస్తోంది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలే అవకాశముంది. అదే జరిగితే రాజమౌళితో సినిమాకి ముందు పరాజయం అందుకున్న హీరోగా చరణ్ సరసన మహేష్ కూడా నిలుస్తాడు. పైగా చరణ్, మహేష్ కి షాకిచ్చిన రెండూ కూడా సంక్రాంతి సినిమాలే కావడం విశేషం.
గతంలో కూడా ‘సింహాద్రి’కి ముందు ‘నాగ’తో ఎన్టీఆర్, ‘సై’కి ముందు ‘శ్రీ ఆంజనేయం’తో నితిన్, ‘ఛత్రపతి’కి ముందు ‘చక్రం’తో ప్రభాస్, ‘విక్రమార్కుడు’కి ముందు ‘షాక్’తో రవితేజ పరాజయాలు ఎదుర్కొన్నారు. వీటిలో ‘నాగ’ సినిమా 2003 సంక్రాంతికి విడుదల కావడం మరో విశేషం.