అదరగొట్టిన దూబే
అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యఛేదనలో భారత యంగ్ ఆల్‌రౌండర్ శివం దూబే 40 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేసి టీమిండియాను విజయ పథాన నడిపాడు. అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వికెట్ కీపింగ్ బ్యాటర్ జితేశ్ శర్మ (31) మెరిపించాడు. శుభ్‌మన్ గిల్ (23), తిలక్ వర్మ (26), రింకూ సింగ్ (16 నాటౌట్) పర్వాలేదనిపించారు. 17.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 159 రన్స్ చేసి గెలిచింది భారత్. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మహమ్మద్ నబీ (42) రాణించగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (23), ఇబ్రహీం జర్దాన్ (25), అజ్మతుల్లా జజాయ్ (29) మోస్తరుగా ఆడారు. చివర్లో నజ్మతుల్లా జర్దాన్ (19 నాటౌట్) మెరిపించడంతో అఫ్గాన్‌కు ఆ మాత్రం స్కోరు దక్కింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ చెరో రెండు, శివమ్ దూబే ఓ వికెట్ తీసుకున్నారు.