ఏకగ్రీవ మంత్రంతో హస్తం పార్టీ…!

- బీఆర్‌ఎస్‌ను మట్టికరిపించెందుకు హస్తం టార్గెట్
- తాండూరు పొలిటికల్ మైండ్‌గేమ్ మామూలుగా లేదు
- తాండూరు పంచాయతీ వార్
- ‘క్లీన్ స్వీప్’ టార్గెట్… దిశగా హస్తం
- బీఆర్‌ఎస్ ‘పోటీ’కి వస్తుందా?
- పత్తలేని కమలం పార్టీ
- ఎన్నికల కోసం ఎదురుచూపులు
- ప్రస్తుత హాట్ టాపిక్ ఇదే…..
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల కంటే ఏ మాత్రం తక్కువ కాదన్నంత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహం, ఆ పార్టీ నియోజకవర్గ నాయకత్వం అనుసరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ పక్కా వ్యూహం ఏకగ్రీవం’తో బీఆర్‌ఎస్‌కు పోటీ లేకుండా!
తాండూరులో కాంగ్రెస్ పార్టీ కన్ను కేవలం గెలుపుపైనే కాదు, ఏకంగా ఏకగ్రీవాలపై పడింది. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నేతల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది—అసలు బీఆర్‌ఎస్ పార్టీని పోటీకే రానివ్వకూడదు అనేది వారి టార్గెట్. అంటే, కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు లేకుండా క్షేత్రస్థాయిలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీని ద్వారా, ఎన్నికల ఖర్చుతో పాటు సమయాన్ని కూడా ఆదా చేసుకోవాలని, నియోజకవర్గంలో తమకు తిరుగులేదనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
క్యాడర్‌ను నిలబెట్టుకునేందుకు పైలట్ రోహిత్ రెడ్డి వ్యూహాలు
ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్-ఛార్జ్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ క్యాడర్‌ను బలంగా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధికార పార్టీలో చేరికలు, స్థానిక అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా, పాత, కొత్త నాయకులను సమన్వయం చేసుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయి విజయాన్ని సాధించేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. తమ పార్టీ వైపు మొగ్గు చూపేలా గ్రామస్థాయి నాయకత్వాన్ని ఆకర్షించడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. గెలుపు మాట పక్కన బెడితే కేవలం పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉంటే చాలు అనే అంశం పై పైలట్ ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ ఆచూకీ గల్లంతు: ‘వార్డ్ మెంబర్ కూడా లేరు’
ఈ రాజకీయ పోరాటంలో బీజేపీ పార్టీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ‘సర్పంచ్ కాదు కదా, బీజేపీకి వార్డ్ మెంబర్ కూడా లేరు’ అన్నట్టుగా ఉంది స్థానిక రాజకీయాల్లో ఆ పార్టీ ఉనికి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ప్రధాన పోరు జరుగుతుండగా, బీజేపీ నామినేషన్ల విషయంలో కనీస ప్రభావం చూపలేకపోవడం గమనార్హం.
ఆ గట్టునుంటావా… ఈ గట్టునుంటావా….!
గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం ఇప్పుడు ‘ ఆ గట్టునుంటావా…. ఈ గట్టునుంటావా….’ అన్నట్టే కొనసాగుతోంది. గెలుపు గుర్రంగా భావిస్తున్న కాంగ్రెస్ వైపు గ్రామ స్థాయి నేతలు మొగ్గు చూపడానికి సిద్ధమవుతున్నారు. పాత పరిచయాలు, కొత్త సమీకరణాల మధ్య నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారడానికి సిద్ధమవుతూ, తాండూరు స్థానిక సంస్థల ఎన్నికల హడావిడిని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
మున్ముందు తాండూరులో మరిన్ని ఏకగ్రీవాలు నమోదవుతాయా? కాంగ్రెస్ వ్యూహాన్ని బీఆర్‌ఎస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.



