Thursday, October 24, 2024

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ప్రమాదం.. 16 మంది మృతి!

posted on Aug 21, 2024 10:16PM

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్ పేలడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అచ్యుతాపురం ఫార్మా జెస్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్‌లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా, మొదటి అంతస్తు శ్లాబు కింద పడి ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో రెండో షిఫ్టులోని దాదాపు 380 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు కూలిపోయిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు కార్మికులు చెబుతున్నారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల తరలింపునకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ వాడాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారులను ఆదేశించారు. రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మికశాఖ మంత్రి సుభాష్ అన్నారు. భారీగా పొగవల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ఘటనాస్థలిలో కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మృతుల పూర్తి వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు.

ఇప్పటి వరకు అందిన మృతుల వివరాలు…

1. వి. సన్యాసినాయుడు, ప్లాంట్ ఏజీఎం, 2. రామిరెడ్డి, ల్యాబ్ హెడ్, 3. హారిక, కెమిస్ట్, 4. పార్థసారథి, ప్రొడక్షన్ ఆపరేటర్, 5. వై. చిన్నారావు, ప్లాంట్ హెల్పర్, 6. పి.రాజశేఖర్, 7. మోహన్, ఆపరేటర్, 8. గణేష్, ఆపరేటర్, 9. హెచ్. ప్రశాంత్, 10. ఎం. నారాయణరావు.. మరో ఆరుగురి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana