సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఈరోజు(జనవరి 12న) ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అయితే వీటిలో ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా, ‘గుంటూరు కారం’కి మాత్రం డివైడ్ టాక్ వస్తోంది.
టీజర్ తోనే ‘హనుమాన్’ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు సినిమా విడుదల తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురుస్తున్నాయి. హనుమంతుడిని లింక్ చేస్తూ సూపర్ హీరో కథని చక్కగా రాసుకున్నాడని, పరిమిత బడ్జెట్ లో కూడా అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చాడని ప్రశంసిస్తున్నారు. ఈ సంక్రాంతి హనుమాన్ వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని చెబుతున్నారు.
ఇక ‘గుంటూరు కారం’ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో ‘గుంటూరు కారం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైందనే టాక్ వినిపిస్తోంది. కథాకథనాల్లో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని.. మహేష్ స్టార్డం, సంక్రాంతి సీజనే ఈ సినిమాని కాపాడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.