సినిమా పేరు: హనుమాన్
నటీనటులు: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్,వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు
సంగీతం: అనుదీప్ దేవ్, గౌరహరి,కృష్ణ సౌరబ్
సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర
ఎడిటర్: సాయిబాబు తలారి
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ: జనవరి 12, 2024
ఒక టాప్ హీరో లేదా ఒక టాప్ డైరెక్టర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తారో ఆ రేంజ్ లో అందరూ ఎదురు చూసిన సినిమా ‘హనుమాన్’. పైగా ‘జాంబిరెడ్డి’ తర్వాత తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ ల కాంబోలో హనుమాన్ వస్తుండంతో అందరిలోనూ అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి హనుమాన్ ప్రేక్షకులని అలరించిందో లేదో చూద్దాం.
కథ:
అంజనాద్రి పర్వతాలు ఉన్న దగ్గరలో అంజనాద్రి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో హనుమంతు(తేజ సజ్జ) పని పాట లేకుండా సరదాగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అతనికి అక్క అంజమ్మ( వరలక్ష్మి శరత్ కుమార్) ఉంటుంది. తమ్ముడు హనుమంతు అంటే అంజమ్మకి చాలా ప్రేమ. ఆ కారణంతోనే పెళ్లి చేసుకోకుండా ఉంటుంది. తేజ సజ్జకి చిన్నప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన మీనాక్షి (అమృత అయ్యర్) అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ఒకసారి బందిపోటుల బారి నుంచి మీనాక్షిని కాపాడే ప్రాసెస్ లో హనుమంతు సముద్రంలో పడిపోతాడు. ఆ తర్వాత బయటకి వచ్చిన హనుమంతు అత్యంత బలవంతుడుగా మారతాడు. కొడితే ఎంత పెద్ద కొండైనా పిండి అయ్యే రేంజ్ లో హనుమంతు బలాన్ని సంపాదిస్తాడు. ఇదే క్రమంలో చిన్నప్పుడే వరల్డ్ లో అందరి కంటే గొప్ప సూపర్ మాన్ కావాలని, కన్న తల్లిదండ్రులనే చంపిన మైఖేల్ అంజనాద్రి ఊరు వస్తాడు. హనుమంతు శక్తిని తెలుసుకుంటాడు. ఆ తర్వాత మైఖేల్ ఏం చేసాడు?. అసలు అతను ఆ ఊరు ఎందుకు వచ్చాడు?. హనుమంతుకి అంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? అసలు హనుమంతుడుకి ఈ కథకి సంబంధం ఏంటి? ఇలా పలు ప్రశ్నలకి సమాధానమే ఈ హనుమాన్.
ఎనాలసిస్:
హనుమాన్ మూవీని చూస్తున్నంత సేపు కూడా ఒక కొత్త సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సినిమా ఓపెనింగ్ చాలా కొత్తగా ఉండటంతో పాటు కథలో హనుమంతుడిని అంచలంచలుగా ఇంక్లూడ్ చెయ్యడం చాలా బాగుంది. దీంతో ప్రేక్షకుడు ప్రతి నిమిషం ఆంజనేయుడుని తలుచుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా ఆంజనేయుడు రూపమైన వానరానికి తేజ సజ్జ కి మధ్య జరిగే ఎపిసోడ్ అయితే సూపర్ గా ఉంది. పైగా వానరానికి మాస్ మహారాజా రవితేజ వాయిస్ సూపర్ గా సెట్ అయ్యి ప్రేక్షకులకి నవ్వుల్నీ పంచింది. అక్కాతమ్ముళ్లుగా వరలక్ష్మి, తేజ మధ్య సన్నివేశాలు మెప్పించాయి. టోటల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ గా ఉంది. దీంతో ప్రేక్షకుడు సెకండ్ హాఫ్ మీద భారీ అంచనాలు పెట్టుకోవడంతో మూవీ కొంచం డల్ అయిందనే భావన కలుగుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లాగ్ ఉంటాయి. కానీ దర్శకుడు అదంతా కథ కోసమే అలా చెయ్యాల్సి వచ్చిందని ఆడియెన్స్ కి క్లైమాక్స్ కి గాని అర్ధం అవ్వదు. సినిమా మొత్తం మీద కొంచం మైనస్ గా అనిపించే విషయం ఏంటంటే విలన్ ఒక లక్ష్యం కోసం అంజనాద్రి వచ్చి మధ్యలో డైవర్ట్ అవ్వటం అనేది ప్రేక్షకుడికి కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉంది. హను మాన్ సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన విధానం బాగుంది. ‘కార్తికేయ 2’ లా ఈ సినిమా కూడా నార్త్ బెల్ట్ లో రికార్డు కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
హనుమాన్ లో నటించిన నటులందరూ కూడా తమ ప్రాణం పెట్టి నటించారు. తేజ సజ్జ అయితే కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ లో వీర విహారం చేసాడు. తేజ ని స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ఒక బిగ్ హీరోని చూసినట్టుగానే ఉంది. అలాగే హీరోయిన్ గా చేసిన అమృత అయ్యర్ తన ఊరు మంచి కోరుకునే క్యారక్టర్ లో చాలా చక్కగా ఒదిగిపోయింది. వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇలాంటి క్యారక్టర్ లు కొట్టిన పిండి. స్వర్గీయ రాకేష్ మాస్టర్ రౌడీ క్యారక్టర్ లో సూపర్ గా చేసాడు. ఆయన బతికి వుంటే బిజీ ఆర్టిస్ట్ గా మారేవాడు. సముద్రఖణి పాత్ర ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, రోహిణి బాగానే నవ్వించారు.
ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే ఒక కొత్తదనం తో కూడిన కథ ని ప్రేక్షకులకి అందించాలన్న తన తపన ప్రతి ఫ్రేమ్ లోను కనపడింది. అలాగే కథ లోని క్యారక్టర్ ల ఔన్నిత్యం దెబ్బ తినకుండా ఆంజనేయ స్వామిని ప్రశాంత్ వాడుకున్న విధానం అందరిని మెప్పిస్తుంది. అలాగే గ్రాఫిక్ వర్క్స్ ని కూడా చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరి చేత ‘జై హనుమాన్’, ‘జై శ్రీరామ్’ అనేలా చేసింది. కెమెరా అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్స్ కూడా ఒక కొత్త ప్రపంచాన్ని మనకి చూపించాయి.
తెలుగువన్ పర్స్పెక్టివ్:
హనుమాన్ మూవీని ఆ హనుమంతుడే దగ్గరుండి మరీ హిట్ చేయించుకున్నాడు అనిపిస్తుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా అందరి చేత థియేటర్స్ లో ‘జై హనుమాన్’, ‘జై శ్రీరామ్’ అనే నినాదాలని చేయిస్తుంది. అలాగే ఈ సంక్రాంతికి విజయాన్ని కూడా అందుకుంటుంది అనడంలో సందేహం లేదు.
రేటింగ్: 3/5
– అరుణాచలం