సూర్యాపేట మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది?
మున్సిపల్ ఎన్నికల నాటికి సూర్యాపేట మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. 48 మంది వార్డు కౌన్సిలర్లు ఉన్న సూర్యాపేట మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ పోస్టు కోసం జనరల్ విభాగానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు ఆశ పెట్టుకున్నారు. ఈ మేరకు కొంత ఖర్చులు పెట్టుకుని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇతర కౌన్సిలర్ల మద్దతు కూడగట్టారు. అనూహ్యంగా, అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించి జనరల్ మహిళలకు చెందాల్సిన మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠాన్ని ఎస్సీ మహిళకు కట్టబెట్టారు. ఇలా.. పెరుమాళ్ల అన్నపూర్ణ ఛైర్ పర్సన్ గా పీఠం ఎక్కారు. దీంతో పదవులు ఆశించిన కౌన్సిలర్లు తీవ్ర నిరాశకు లోనై లోలోన రగిలిపోయారు. అప్పటి మున్సిపల్ , ఐటీ శాఖా మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఛైర్ పర్సన్ అభ్యర్థిత్వం ఖరారు కావడం, బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వంటి కారణాలతో మిన్నకుండి పోయారు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రంలో అధికారం మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో అధికారాన్ని హస్తం గతం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మండల పరిషత్తుల్లో ఎంపీపీ పదవులకు, మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు అవిశ్వాసాలు పెడుతుండడంతో సూర్యాపేట కౌన్సిలర్లకూ ధైర్యం వచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లే అధికంగా ఉన్న సూర్యాపేట మున్సిపాలిటీలో పార్టీ కౌన్సిలర్లు, పార్టీకి చెందిన ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.