- తాండూర్ మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పరిశీలకుల నియామకం
- కాంగ్రెస్ అబ్జర్వర్ల నియామకం
- మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫోకస్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ మున్సిపాలిటీకి జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ కోసం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తరపున ఐదుగురు పరిశీలకులను నియమిస్తూ స్థానిక ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు శనివారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుండి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఎన్నికల పరిశీలకులుగా పరిమళ్ గుప్తా, పి. నర్సింహులు, గురురాజ్ జోషి, అలీమ్ భాయ్, నర్సింగ్ రావు (అడ్వకేట్) నియమితులయ్యారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి వీరు కృషి చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన ఈ సందర్భంగా కొత్త పరిశీలకులకు సూచించారు. తాండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.






