Saturday, January 31, 2026
Home NEWS పోటీ నుండి తప్పుకున్న అంజాద్ ఖాన్…!

పోటీ నుండి తప్పుకున్న అంజాద్ ఖాన్…!

0
428
  • మున్సిపల్ బరి నుండి అంజాద్ ఖాన్ అవుట్!
  • తాండూరులో హైడ్రామా.. పార్టీల దోబూచులాటతో విసిగిన అభ్యర్థి 
  • కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే తప్పుకుంటున్నట్లు వెల్లడి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత 24 గంటలుగా సాగిన నాటకీయ పరిణామాల మధ్య 3వ వార్డు అభ్యర్థి అంజాద్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎన్నికల పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇరు పార్టీల మధ్య జరిగిన ‘పొలిటికల్ గేమ్’ తన కుటుంబంలో చిచ్చు పెట్టిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తాండూరు మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా అంజాద్ ఖాన్ ప్రచారంలో నిలిచారు. అయితే, గురువారం అనూహ్యంగా కాంగ్రెస్ నాయకులు ఆయనను పార్టీలోకి ఆహ్వానించి, హస్తం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. కానీ, ఈ సంతోషం కాంగ్రెస్ వర్గాల్లో కొద్ది గంటలు కూడా నిలవలేదు. వెంటనే రంగంలోకి దిగిన బిఆర్ఎస్ నేతలు, అంజాద్ ఖాన్‌తో చర్చలు జరిపి మళ్లీ గులాబీ కండువా కప్పారు.ఒకే రోజు రెండు ప్రధాన పార్టీల కండువాలు మార్చడం అంజాద్ ఖాన్ కుటుంబంలో తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. పార్టీల మార్పు వ్యవహారంపై కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, ఆయనపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన అంజాద్ ఖాన్.. ఏ పార్టీ తరపున కూడా నేను పోటీ చేయడం లేదని, తన కుటుంబమే ఆయనకు ముఖ్యం అని తేల్చి చెప్పారు. అభ్యర్థి అనుకున్న వ్యక్తి అనూహ్యంగా తప్పుకోవడంతో ఇటు బిఆర్ఎస్, అటు కాంగ్రెస్ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. 3వ వార్డులో ఇప్పుడు ఇరు పార్టీలు కొత్త అభ్యర్థుల వేటలో పడతారా..? అనేది ప్రశ్నగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here