- తాండూరులో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్!
- బలవంతపు చేరికలు సాగవని తేల్చిచెప్పిన అమ్జద్ ఖాన్
- మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో తిరిగి బీఆర్ఎస్‌లోకి..
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు రాజకీయాల్లో శుక్రవారం హైడ్రామా చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని విధంగా బీఆర్ఎస్ నాయకుడు అమ్జద్ ఖాన్ షాక్ ఇచ్చారు. బలవంతంగా పార్టీలో చేర్చుకున్న కొద్ది గంటల్లోనే, తిరిగి సొంత గూటికి చేరుకుని కాంగ్రెస్ నేతలకు చెంపపెట్టు వంటి సమాధానం ఇచ్చారు.మున్సిపల్ పరిధిలోని 3వ వార్డుకు చెందిన కీలక బీఆర్ఎస్ నాయకుడు అమ్జద్ ఖాన్‌ను ఈరోజు ఉదయం కొంతమంది కాంగ్రెస్ నాయకులు బలవంతంగా తీసుకెళ్లినట్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి, ఇష్టం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారని ఆరోపించారు.కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వెంటనే అక్కడి నుండి నేరుగా బయటకు వచ్చిన అమ్జద్ ఖాన్.. తన మద్దతుదారులు, వార్డు ప్రజలతో కలిసి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు తనను మోసపూరితంగా, బలవంతంగా తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోహిత్ రెడ్డి సమక్షంలో మళ్ళీ గులాబీ కండువా కప్పుకున్నారు. కార్యకర్తలను బెదిరించి పార్టీలో చేర్చుకోవాలని చూస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హెచ్చరించారు. అమ్జద్ ఖాన్ తిరిగి రావడం బీఆర్ఎస్ పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామంతో తాండూరు పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.






