డీజీపీ ఆంక్షలు ఉపసంహరించుకోవాలి..!

- స్వాముల మనోభావాలు దెబ్బతీయద్దు
- తాండూరు డిఎస్పీకి వినతి..
తాండూరు జనవహీని ప్రతినిధి : శబరిమల దీక్ష ధరించిన పోలీస్ శాఖ సిబ్బంది యూనిఫామ్ ధరించాలంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి విధించిన ఆంక్షలు సరికాదని, ఈ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అయ్యప్ప స్వాములు, వివిధ హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వాముల బృందం, పలువురు నాయకులతో కలిసి తాండూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డీఎస్పీకి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
తెలంగాణ పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న అయ్యప్ప మాల ధారణ స్వాములకు యూనిఫామ్ ధరించాలని డీజీపీ శివధర్ రెడ్డి విధించిన ఆంక్షలు వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలలో మాల ధరించిన సిబ్బందికి యూనిఫామ్ మినహాయింపు ఉంటుందని, మాల ధరించినంత కాలం వారు నల్ల దుస్తులు లేదా ఇతర దీక్ష దుస్తులను ధరిస్తారని గుర్తుచేశారు.
తక్షణమే డీజీపీ ఈ ఆంక్షలను ఉపసంహరించుకోవాలని, తద్వారా అయ్యప్ప స్వాముల మనోభావాలను గౌరవించాలని వారు కోరారు.



