వైభవంగా అయ్యప్ప స్వామి వార్షికోత్సవం..!

- భక్తులతో కిటకిటలాడిన తాండూరు పురవీధులు!
- స్వాములకు సద్ది వడ్డించిన స్వప్న పరిమళ్
తాండూరు జనవాహిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇవాళ శ్రీ అయ్యప్ప స్వామి వారి వార్షికోత్సవ వేడుకలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అయ్యప్ప భక్తులు, స్వామి శరణు ఘోషతో పట్టణమంతా మార్మోగింది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి శ్రీ అయ్యప్ప స్వామి వారి శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారి దివ్య రూపాన్ని రథంపై అలంకరించి, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా పురవీధుల్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, భజన కీర్తనలతో భక్తులు భక్తి భావాన్ని చాటుకున్నారు. ఊరేగింపు పొడవునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ, దీపాలు వెలిగిస్తూ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.ఈ భక్తిపూర్వక కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి స్వప్న పరిమళ్ పాల్గొన్నారు. ముఖ్యంగా, అయ్యప్ప స్వాములు నియమ నిష్టలతో చేపట్టిన మండల పూజ ముగింపు సందర్భంగా జరిగిన “సద్ది” కార్యక్రమం లో ఆమె స్వయంగా స్వాములకు సద్ది వడ్డించారు. ఈ సేవలో పాల్గొనడం అదృష్టంగా భావించినట్టు ఆమె తెలియజేశారు.ఈ వార్షికోత్సవ వేడుకలు అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షం తాండూరు ప్రజలపై నిరంతరం ఉండాలని కోరుకుంటూ, భక్తులందరి హృదయాల్లో భక్తి భావాన్ని మరింతగా పెంచాయన్నారు.



