Hyderabad Crime : హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరమ్ మాల్ సర్కిల్ లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో కారుతో హల్చల్ చేశాడు. రాంగ్ రూట్ లో కారును అతివేగంగా నడుపుతూ మరో కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ముగ్గురి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో కారులో ఉన్న వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరి వ్యక్తుల్లో ఒకరికి కుడి చేయి ఫ్రాక్చర్ కాగా మరో వ్యక్తి తలకు బలమైన గాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు అగ్రజ్ రెడ్డితో పాటు అతడి స్నేహితులు తేజ్, కార్తిక్ లపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గచ్చిబౌలి లోని ఓ పబ్ లో పార్టీని ముగించుకొని వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు అగ్రజ్ రెడ్డికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా మోతాదుకు మించి అతడు మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన వారు రాజస్థాన్ కు చెందిన కార్మికులు దూర్ చాంద్, బాన్వర్ లాల్ గా పోలీసులు గుర్తించారు.