KTR : తన ఇంటికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ ఇంటికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. జనవరి 2న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ఇబ్రహీం ఖాన్ కేటీఆర్ కి తన ట్వీట్ లో తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని అయితే ఈ ఐదు సంవత్సరాల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కేటీఆర్ ను కోరారు. బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్ కి తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీం ఖాన్ కు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ ఇబ్రహీంఖాన్ ఇంటికి తప్పకుండా వస్తానని ఇచ్చిన మాట మేరకు ఆదివారం బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లారు.