Saturday, January 31, 2026
Home NEWS టికెట్ రాకుంటే ఏం చేద్దాం…!

టికెట్ రాకుంటే ఏం చేద్దాం…!

0
162
  • ‘బి-ఫామ్’ గుబులు.. ఆశావహుల ‘ప్లాన్-బి’!
  • నేడు అభ్యర్థుల ఖరారు.. టికెట్ రాకుంటే దారి చూసుకుంటామంటున్న నేతలు
  • సర్వే రిపోర్టులే ప్రామాణికం.. 
  • టెన్షన్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు!

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన సందర్బంగా పట్టణ రాజకీయాల్లో వేడి మొదలైంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల జాబితా నేడు ఖరారు కానున్న నేపథ్యంలో.. ‘బి-ఫామ్’ దక్కని పక్షంలో ఏం చేయాలనే అంశంపై ఆశావహులు తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారు. టికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతల్లో ఇప్పుడు ఉత్కంఠతో పాటు తిరుగుబాటు సెగలు కూడా కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మార్క్ ‘సర్వే’ వ్యూహం!

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు ప్రక్రియ ఈసారి ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే ప్రతి వార్డులోనూ క్షేత్రస్థాయిలో రహస్య సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వేలో ప్రజల మద్దతు ఎవరికి ఉంటే వారికే టికెట్ కేటాయిస్తామని, వ్యక్తిగత పంతాలకు పోయేది లేదని ఆయన ఇప్పటికే అభ్యర్థులకు సద్ది చెప్పారు. అయితే, ఈ సర్వే నివేదికలో తమ పేరు ఉందో లేదోనని ఆశావహులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎమ్మెల్యే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేయడంతో, టికెట్ దక్కని పక్షంలో తాము ఏ గూటికి చేరాలనే దానిపై కొందరు నేతలు లోలోన మంతనాలు జరుపుతున్నారు.

బిఆర్ఎస్ లో రెబల్స్ బెడద?

మరోవైపు, బిఆర్ఎస్ పార్టీలోనూ ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో టికెట్ల కేటాయింపు కత్తి మీద సాములా మారింది. ముఖ్యంగా పార్టీ బి-ఫామ్ దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు లేదా ఇతర పార్టీల వైపు చూసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ విధివిధానాల కంటే తమ వ్యక్తిగత పట్టు నిరూపించుకోవడమే లక్ష్యంగా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు.

ప్రతిపక్షానికే జై కొడతారా?

పట్టణానికి చెందిన మరికొందరు కీలక నాయకులు ఒక అడుగు ముందుకు వేసి సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్లు సమాచారం. తమకు టికెట్ రాకుంటే, ఏకంగా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి తమ పార్టీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పనిచేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఇరు పార్టీల అధిష్టానాలకు పెద్ద తలనొప్పిగా మారింది.

నేడే క్లైమాక్స్.. ముఖచిత్రం మారేనా?

నేడు అధికారికంగా అభ్యర్థుల లిస్ట్ బయటికి వచ్చిన అనంతరం తాండూరు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. అసంతృప్త నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎవరు రాజీపడతారు? ఎవరు తిరుగుబాటు జెండా ఎగురవేస్తారు? అనేది ఇప్పుడు ఊరువాడ ఉత్కంఠ రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here