- మునిసిపల్ అభ్యర్థులకు అలర్ట్
- రెండు చోట్ల ఓటు ఉంటే నామినేషన్ రిజెక్ట్!
- ఓటర్ లిస్ట్‌లో తప్పుంటే గెలిచినా వృథానే
జనవాహిని డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో, అభ్యర్థుల అర్హతలపై ఎన్నికల నిబంధనలు అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా ఓటు హక్కు, రిజర్వేషన్లు మరియు నామినేషన్ల ప్రక్రియపై అభ్యర్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమరపాటుగా ఉంటే చిన్న సాంకేతిక కారణంతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.ఒకే వ్యక్తి అటు గ్రామ పంచాయతీలో, ఇటు మునిసిపాలిటీలో ఓటు హక్కు కలిగి ఉండటం చట్టవిరుద్ధం. రిప్రెసెంటేషన్ అఫ్ ది పీపుల్ యాక్ట్, 1950 – సెక్షన్ 17 ప్రకారం.. ఒక వ్యక్తి రెండు వేర్వేరు ఓటర్ జాబితాల్లో పేరు కలిగి ఉండకూడదు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, కానీ నామినేషన్ వేసే సమయానికి సంబంధిత మునిసిపాలిటీ ఓటర్ లిస్ట్‌లో మాత్రమే పేరు ఉండాలి. రెండు చోట్ల పేరు ఉండి పోటీ చేస్తే, స్క్రూటినీ సమయంలో నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది.ఒకవేళ గెలిచినప్పటికీ, ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే ఆ ఎన్నిక చెల్లకుండా పోతుందని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఓటర్ జాబితా ‘ఫ్రీజ్’ అవుతుంది. ఆ తర్వాత కొత్తగా పేర్లు చేర్చుకోవడం లేదా మార్పులు చేయడం సాధ్యం కాదు. కావున, పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ చివరి తేదీ కంటే ముందే తమ ఓటు మునిసిపాలిటీ పరిధిలోకి మారిందో లేదో సరిచూసుకోవాలి. నివాస ఆధారంగా ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండటం తప్పనిసరి.రిజర్వేషన్లు – కుల ధ్రువీకరణ పత్రం వార్డుల రిజర్వేషన్ల విషయంలో కూడా అభ్యర్థులు స్పష్టతతో ఉండాలి. బీసీ / ఎస్సి / ఎస్టీ / మహిళా రిజర్వేషన్లు అనేవి సదరు వార్డుకు (సీటుకు) కేటాయించినవి. రిజర్వ్డ్ వార్డులో పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.ఓటర్ లిస్ట్‌లో కులం పేరు ఉండాల్సిన అవసరం లేదు, కానీ నామినేషన్ పత్రాలతో పాటు కుల ధ్రువీకరణ పత్రం జత చేయడం మాత్రం నిబంధన.చిన్నపాటి సాంకేతిక లోపాలు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే అవకాశం ఉన్నందున, నామినేషన్ వేసే ముందే అభ్యర్థులు తమ అర్హతలను, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






