- తాండూరులో చిన్నారుల అక్షర శ్రీకారం
- శ్రీ సాయి మేధ విద్యాలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు
- పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సామూహిక అక్షరాభ్యాసం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద గల శ్రీ సాయి మేధ విద్యాలయం మరియు ఆపిల్ కిడ్స్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘సామూహిక అక్షరాభ్యాసం’ కార్యక్రమం భక్తి పారవశ్యం మధ్య కొనసాగింది.ఉదయాన్నే సరస్వతీ మాతకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం, పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. తమ బిడ్డలు విద్యాబుద్ధులలో రాణించాలని కోరుకుంటూ చిన్నారుల చేత పలకలపై అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. సరస్వతీ దేవి జ్ఞానానికి, వాక్కుకు మూలమని, అటువంటి పవిత్రమైన రోజున అక్షరాభ్యాసం చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువు చెబుతున్నప్పటికీ, హైందవ ధర్మ విశిష్టతను పిల్లలకు అందిస్తున్నామని చెప్పారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.






