- తాండూర్ మున్సిపాలిటీలో ‘అర్ధరాత్రి’ సంతకాల పర్వం!
- బదిలీ అయినా వీడని కుర్చీ మమకారం.. అకౌంట్ సెక్షన్‌లో ఏం జరుగుతోంది?
- ఎన్నికల వేళ నిబంధనలు తుంగలో.. గుట్టుగా ఫైళ్ల క్లియరెన్స్?
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ మున్సిపల్ కార్యాలయం బుధవారం రాత్రి అనుమానాస్పద లావాదేవీలకు వేదికైందా? బదిలీ వేటు పడిన అధికారి అర్ధరాత్రి వేళ ఆఫీసులో ఏం చేస్తున్నారు? అకౌంట్ సెక్షన్‌లో ఫైళ్లపై ఆగమేఘాల మీద సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తాండూర్ పట్టణంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాండూర్ మున్సిపల్ కమిషనర్ బుధవారమే బదిలీ అయ్యారు. నిబంధనల ప్రకారం బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే సదరు అధికారి కీలక నిర్ణయాలకు, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. కానీ, తాండూర్ కమిషనర్ మాత్రం రాత్రి 10 గంటల సమయంలో కార్యాలయంలోని అకౌంట్ సెక్షన్‌లో ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. బదిలీ అయిన అధికారి అర్ధరాత్రి దాకా ఫైళ్లను తిరగేయడం వెనుక పెద్ద ‘నెట్‌వర్క్’ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉంది. ప్రతి రూపాయి ఖర్చుపై ఎన్నికల సంఘం నిఘా పెట్టె సమయం, బదిలీ అయిన అధికారి బిల్లులపై సంతకాలు చేయడం తీవ్ర ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాత తేదీలతో చెక్కులు జారీ చేయడం లేదా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను హడావుడిగా క్లియర్ చేయడం కోసమే ఈ ‘నైట్ ఆపరేషన్’ సాగుతోందని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అసలే బదిలీపై వెళ్తున్న అధికారి.. వెళ్లే ముందు ఇంత ఉత్సాహం చూపించడం వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉందా? లేక భారీ స్థాయిలో కమీషన్ల వ్యవహారం ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫీసు సిబ్బందిలో కొందరు దీనికి సహకరిస్తున్నట్లు సమాచారం. బదిలీ అయినా కూడా ‘కుర్చీ’ని వదలని ఈ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






