- రిజర్వేషన్ల సెగ.. నేతల గుండెల్లో దడ!
- 36 వార్డుల్లో మారుతున్న సమీకరణాలు
- సీనియర్లకు రిజర్వేషన్ల చెక్.. అభ్యర్థుల వేటలో పార్టీలు
- సిట్టింగ్‌లకే మొగ్గు? మార్పు కోసం నూతన అభ్యర్థుల పోటీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా వెలువడిన వార్డుల రిజర్వేషన్లు అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారాయి. పట్టున్న వార్డుల్లో రిజర్వేషన్లు తారుమారు కావడంతో ఏ వార్డులో ఎవరిని బరిలోకి దించాలో తెలియక పార్టీ అధిష్టానాలు తలలు పట్టుకుంటున్నాయి.మున్సిపాలిటీలోని 36 వార్డులకు సంబంధించి ఖరారైన రిజర్వేషన్లు పలువురు సీనియర్ నాయకుల ఆశలపై నీళ్లు చల్లాయి. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ, వార్డులపై పట్టు సాధించిన హేమాహేమీలకు ఈసారి రిజర్వేషన్లు అడ్డుగా నిలిచాయి. దీంతో చాలామంది సీనియర్లు తమ రాజకీయ వారసులను లేదా అనుచరులను రంగంలోకి దించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్లు అనుకూలించని నేతలు తమ సామాజిక వర్గానికి కేటాయించిన పక్క వార్డుల వైపు చూపు చూస్తున్నారు. వార్డుల వారీగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారు.పలు వార్డుల్లో పాత వారికే (సిట్టింగ్ కౌన్సిలర్లకే) అవకాశం ఇస్తే బాగుంటుందని కొందరు నాయకులు భావిస్తుండగా, అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.మరోవైపు, కొత్త రక్తం రావాలని, నూతన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని యువత మరియు కొత్త ఆశావహులు పట్టుబడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తాండూరు గల్లీల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. చాయ్ కొట్లు, కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా రిజర్వేషన్లు, అభ్యర్థుల గెలుపోటములపైనే చర్చ జరుగుతోంది. కౌన్సిల్ స్వరూపం ఈసారి పూర్తిగా మారే అవకాశం ఉండటంతో, తాండూరు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పట్టు నిలుపుకోవాలని సీనియర్లు, పాగా వేయాలని కొత్తవారు చూస్తుండటంతో ఈసారి పోరు అత్యంత ఆసక్తికరంగా మారనుంది.






