- బిఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నాయకుల క్యూ.
- కండువా కప్పి ఆహ్వానించిన పైలెట్ రోహిత్ రెడ్డి
- కాంగ్రెస్‌ను సమాధి చేసేందుకు తాండూరు ప్రజలు సిద్ధం: మాజీ ఎమ్మెల్యే ధ్వజం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సోమవారం తాండూరు పట్టణంలోని ఎంపిటి ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పరిమళ, సీనియర్ నాయకులు రవీందర్ తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పైలెట్ రోహిత్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, 13 మరియు 15వ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో పైలెట్ రోహిత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాండూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తలకిందులుగా తపస్సు చేసినా తాండూరులో కాంగ్రెస్ గెలవదన్నారు. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకక నా లెఫ్ట్, రైట్ నాయకులను అడుక్కుంటున్నావు అని ఘాటుగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఓడిపోయే మున్సిపాలిటీల్లో తాండూరు మొదటి స్థానంలో ఉంటుంది అని ఎద్దేవా చేశారు.తాండూరుకు మంజూరైన రూ. 18 కోట్ల యూఐడిఎఫ్ నిధుల వెనుక ఉన్న అసలు నిజాన్ని రోహిత్ రెడ్డి బయటపెట్టారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ. 3 కోట్లు మాత్రమేనని, మిగిలిన రూ. 15 కోట్లు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుండి తీసుకున్న అప్పు అని వివరించారు. ఈ లోన్ మొత్తాన్ని వడ్డీతో సహా తాండూరు మున్సిపాలిటీయే చెల్లించాల్సి ఉంటుందని, అప్పు తెచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు డబ్బాలు కొట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను వాడుకుని వదిలేస్తారని, వారి దొంగ గ్యారంటీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సాయిపూర్ నర్సింలు, మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రికే విజయలక్ష్మి, శ్రీనివాస్ చారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, నరేందర్ గౌడ్, సందీప్ రెడ్డి, మంఖాల రాఘవేందర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, సంగీత ఠాకూర్, అనురాధ, సలీం, బషారత్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.






