- 6వ వార్డులో వృధాగా తాగునీరు..
- పట్టించుకోని అధికారులు!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో గత కొన్ని రోజులుగా తాగునీరు వృధాగా రోడ్లపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పట్టణంలో నీటి ఎద్దడి నెలకొంటే, మరోవైపు పైపులైన్ లీకేజీల వల్ల విలువైన నీరు మురుగు కాలువల పాలవుతోంది.గత కొన్ని రోజులుగా స్థానిక రామ మందిరం దగ్గర వార్డులోని ప్రధాన పైపులైన్ నుంచి నీరు లీక్ అవుతోంది. ఈ విషయంపై స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ కారణంగా నీటి ఒత్తిడి తగ్గి, ఇళ్లకు సరైన రీతిలో నీరు అందడం లేదని, గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని వారు పేర్కొంటున్నారు.అసలే ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో నీటి సమస్య తీవ్రమవుతుంటే, ఇలా రోజుల తరబడి నీరు వృధా కావడంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి పైపులైన్ మరమ్మతులు చేపట్టాలని, నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.






